Chhatarpur Deputy Collector: 


ఛత్తర్‌పూర్ డిప్యుటీ కలెక్టర్ 


బాస్ సెలవు ఇవ్వకపోతే ఏం చేస్తాం..? ఓ రోజు బాధ పడతాం. కాదంటే రెండ్రోజులు. ఆ తరవాత మర్చిపోయి మళ్లీ మన పనిలో పడిపోతాం. కార్పొరేట్ ప్రపంచంలో ఈ అసంతృప్తి ఎప్పుడూ ఉండేదే. "లీవ్ అడిగిన టైమ్‌కే అన్నీ గుర్తొచ్చేస్తాయ్" అని తిట్టుకుంటారు కొందరు ఉద్యోగులు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లా డిప్యుటీ కలెక్టర్ మాత్రం ఎవరూ ఊహించని పని చేశారు. సెలవు ఇవ్వలేదన్న కోపంతో ఏకంగా ఆ పదవికి రాజీనామా చేశారు. తన కొత్త ఇంటి గృహప్రవేశానికి సెలవు అడిగారు. స్వయంగా బుద్ధిజం ఫాలోవర్ అయిన నిశా బంగ్రే (Nisha Bangre)...వరల్డ్ పీస్ ప్రైజ్ అవార్డ్ ఈవెంట్‌కి కూడా హాజరవ్వాలని అనుకున్నారు. కానీ పై అధికారులు మాత్రం సెలవు ఇవ్వలేదు. ఈ ఉద్యోగం కన్నా తన సెంటిమెంట్స్‌ తనకు ముఖ్యమని తేల్చి చెప్పిన నిశా బంగ్రే రాజీనామా చేశారు. మే 19వ తేదీనే ఈ లెటర్‌ని పంపారు. జూన్ 25న తన కొత్త ఇంట్లో గృహప్రవేశం పెట్టుకున్నామని, కానీ సెలవు ఇవ్వలేదని అందులో ప్రస్తావించారు. జూన్ 15న ఈ లెటర్‌కి రిప్లై వచ్చింది. MP Civil Services Conduct Rules ప్రకారం...సెలవు ఇవ్వడం కుదరదని పై అధికారులు రిప్లై ఇచ్చారు. ఈ సమాధానంతో అసహనానికి లోనైన నిశా బంగ్రే..జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి మరో లేఖ రాశారు. 


"మీరు పంపిన లేఖ చదివాను. ఇది నన్ను తీవ్రంగా బాధించింది. నా ఇంట్లో వేడుకలకు కూడా నన్ను హాజరు కానివ్వకుండా చేస్తున్నారు. అంతే కాదు. ప్రపంచ శాంతి కోసం పాటు పడిన బుద్ధుడి కార్యక్రమానికీ నేను వెళ్లకుండా చేస్తున్నారు. ఇది నా మనోభావాలను దెబ్బ తీసింది. మతాచారాలనూ ఇది కించపరిచింది. అందుకే..ఇకపై ఈ డిప్యుటీ కలెక్టర్ పదవిలో కొనసాగాలని నేను భావించడం లేదు. నా మత ఆచారాలు, ప్రాథమిక హక్కుల విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వలేను. అందుకే ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను"


- నిశా బంగ్రే, చత్తర్‌పూర్ డిప్యుటీ కలెక్టర్ 


అయితే..ఆమె రాజీనామాని ఇంకా యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. కేవలం రాజకీయ కారణాల వల్లే తనపై ఇలా ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు నిశా. బుద్ధిజాన్ని నమ్ముతున్నందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనకు సెలవు ఇవ్వలేదని విమర్శించారు. నిశా బంగ్రేకు కొందరు ట్విటర్‌లో మద్దతుగా నిలుస్తున్నారు.  మొత్తానికి ఇది మధ్యప్రదేశ్‌లోని హాట్‌టాపిక్‌గా మారింది.