న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గకపోవడం భారత్ సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత, పెట్రోల్ కొరత కస్టమర్లను, ఎల్పీజీ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వదంతులేనని, ఆ వార్తల్లో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ సిలిండర్ బుకింగ్ (LPG Gas Cylinder) నిబంధనల వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్ ఉన్నవారికి 45 రోజులు, సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి 35 రోజుల తర్వాతే సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకోవాలనే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్యాస్ బుకింగ్ గడువు పొడిగించలేదు
గ్యాస్ రీఫిల్ బుకింగ్ కాలపరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదని, పాత నిబంధనలే కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రజలు ఇటువంటి తప్పుడు వార్తలను మరియు సోషల్ మీడియా పోస్ట్‌లను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించింది. ఇంధన సరఫరా, బుకింగ్ ప్రక్రియ ఎప్పటిలాగే సాగుతుందని, నిబంధనలలో మార్పులు ఉంటే ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తుందని స్పష్టం చేసింది.
ఎల్పీజీ సిలిండర్ ఎవరు ఎప్పుడు బుక్ చేసుకోవాలి..కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్బన్ ఏరియాలో అయితే ఓ సిలిండర్ డెలివరీ అయిన 25 రోజుల తరువాత మాత్రమే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకోవాలి.గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ మధ్య గడువు 45 రోజులు ఉండాలని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
భారతదేశంలో ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్పీజీ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అధికారిక, ప్రభుత్వాల ప్రకటనలు మాత్రమే నమ్మాలని సూచించారు.
