Longest Day of the Year 2023:

  సంవత్సరంలో 365 రోజులు లీపు సంవత్సరం అయితే 366 రోజులుంటాయి. ప్రతిరోజూ 24 గంటలు కాగా, ఏడాదిలో నాలుగు రోజులు ప్రత్యేకమైనవి. అవి మార్చి 21, జూన్ 21, సెప్టెంబర్ 23 మరియు డిసెంబర్ 22. రేపు ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పగటి రోజు (జూన్ 21). బుధవారం నాడు పగలు సమయం ఎక్కువ ఉండగా, రాత్రి తక్కువగా ఉంటుంది. దాంతో అతిపెద్ద పగటి సమయం ఉండే రోజుగా జూన్ 21ని వ్యవహరిస్తారు. 


సాధారణ రోజుల్లో పగటి సమయం 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే జూన్‌ 21వ తేదీన కనీసం 13 గంటల 7 నిమిషాల సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది. ఈరోజు సూర్యుడు ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకి లంబంగా వస్తాడు. అందువల్ల మధ్యాహ్నం కొంతసేపు మన నీడ కూడా ఏర్పడదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ 22న సైతం అతిపెద్ద పగటి పూట వచ్చే అవకాశం ఉంది. గతంలో 1975 జరగగా, మళ్లీ 2203 సంవత్సరంలో జూన్ 22న అతిపెద్ద పగటి పూట ఉండే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


సాధారణంగా భారత్ లో తొలి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. దోంగ్ గ్రామంలో దేశంలో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. అయితే ఈ 21న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది. ఏపీలోని గుడివాడలోనూ అదే సమయంలో సూర్యుడు ఉదయించనున్నాడని శాస్త్రవేత్తలు గతంలో తెలిపారు. కొన్నిచోట్ల సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. డిసెంబర్ 22వ తేదీన లాంగెస్ట్ నైట్ డే ఏర్పడుతుంది.


కర్కాటక రాశిలోకి సూర్యుడు..
జూన్ 21న మధ్యాహ్నం సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. భూమధ్యరేఖ మీద ఉన్న సూర్యుడు ఆషాఢ మాసం నాటికి కర్కట రేఖ మీద ప్రవేశిస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలోకి సూర్యుడి ప్రవేశం నాడు పగటి సమయం సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాలలో దాదాపు 14 గంటల వరకు పగటి సమయం ఉంటుంది. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్న సమయంలో నీడ ఏర్పడని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి రాత్రి సమయం అధికం అవుతుంటే, పగటి సమయం కాస్త తగ్గుతుందని జ్యోతిష్కుడు వ్యాస్ తెలిపారు.


సెప్టెంబర్ 21న పగలు, రాత్రి వ్యవధి సమానంగా ఉంటాయి. డిసెంబర్ 22న అదిపెద్ద రాత్రి సమయం ఉంటుంది. మరో స్పెషల్ డే అయిన మార్చి 21 రోజు సూర్యుడు భూమధ్యరేఖకు ఎగువన ఉంటాడు, ఆరోజు పగలు, రాత్రి వ్యవధి సమానంగా ఉంటాయని తెలిసిందే.


సూర్య గమనం ఆధారంగా కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. అంటే ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం...కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పుకున్నా..సరిగ్గా గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు..కేవలం ఏడాదిలో రెండురోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు... అవి మార్చి 21 , సెప్టెంబరు 23.  మిగిలిన ఆరు నెలలు ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial