Parliament Security Security Breach: అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పార్లమెంట్ పై మరో మారు దాడి జరిగింది. అయితే 2001లో జరిగిన దాడి అనూహ్యంగా జరిగితే, ఈ సారి మాత్రం చెప్పి మరీ చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తొయిబాకు, జెయిష్ ఏ  మొహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆ దాడిలో 5 గురు ఢిల్లీ పోలీసులు,  ఇద్దరు పార్లమెంట్ భద్రతా సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ కు చెందిన మహిళా ఉద్యోగి, ఒక తోటమాలి  ఇలా 9 మంది చనిపోయారు. ఈ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. అయితే ఇది అనూహ్యంగా జరిగిన దాడి. 


అయితే ఇవాళ్టి దాడిని నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే సిక్ ఫర్ జస్టిస్  నేత, ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఓ వీడియో విడుదల చేశారు. 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్ పై దాడి జరిగింది. ఇప్పుడు కూడా అదే రోజు లేదా అంతకు ముందే మేం దాడి చేస్తామన్నది ఆ వీడియో సారాంశం. తనను హత్య చేయడానికి భారతదేశ భద్రతా సంస్థలు కుట్ర పన్నాయని దానికి నిరసనగా పార్లమెంట్ పై దాడి చేస్తామని చెప్పారు.


గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని దాన్ని అడ్డుకున్నట్లు  అమెరికా నిఘా సంస్థలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి దాడి ఖలిస్తాన్ ఉగ్రవాదుల పనేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పార్లమెంట్ పై 22 ఏళ్ల క్రితం జరిగిన దాడి రోజే దాడి జరగడం, ఇలా దాడి చేస్తామని గురపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపు వీడియోను విడుదల చేయడం అన్నట్లుగానే పార్లమెంట్ లో ఇద్దరు అగంతకులు ప్రవేశించి ప్రేక్షకుల గ్యాలరీ నుండి పార్లమెంట్ లో దూకడం వంటి సంఘటనలు అందరినీ విస్మయపరుస్తున్నాయి. 


ఎల్లో కలర్ గ్యాస్ ను పార్లమెంట్ లో స్ప్రే చేస్తూ, నినాదాలు చేయడం భద్రతా సంస్థల నిఘా వైఫల్యాన్ని చాటి చెబుతున్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది హెచ్చరికల నేపధ్యంలో  ఈ ఇద్దరు అగంతకులు  పార్లమెంట్ లో ప్రవేశించడం, వారితో పాటు మరో ఇద్దరిని భద్రతా సంస్థలు పార్లమెంట్ వెలుపల అదుపులోకి తీసుకున్నాయి. ఆ ఇద్దరి పాత్ర ఏంటి.  ఆ అగంతకులు ఖలిస్తాన్ ఉగ్రవాదులా, లేకా పాక్ ప్రేరిత ఉగ్రవాదులా అన్న చర్చ సాగుతోంది. ఎవరి సాయంతో పార్లమెంట్ లోకి ప్రవేశించారన్న అంశంపై కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఏది ఏమైనా 2001 పార్లమెంట్ దాడి తర్వాత మళ్లీ 22 ఏళ్లకు అదే రోజు ఈ దాడి జరగడం మన భద్రతా సంస్థల వైఫల్యంగానే చెప్పాలి.