Central Railway Loco Pilot Video: రైల్వేకు చెందిన సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ప్రదర్శించిన ధైర్య సాహసం ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ముంబయి సమీపంలోని ఓ నదీపైన వంతెనపై ఆగిపోయిన ఛప్రా-బౌండ్ గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైలు అలారం చైన్ నాబ్‌ను రీసెట్ చేయడానికి ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ముంబయికి నగరానికి 80 కిలో మీటర్ల దూరంలోని టిట్వాలా - ఖడవాలి మధ్య జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సెంట్రల్ రైల్వే గురువారం ట్విటర్‌లో షేర్ చేసింది.


‘‘పరిస్థితిని అంచనా వేసిన లోకో పైలట్, అలారం చైన్ నాబ్‌ను రీసెట్ చేయడానికి అతి సన్నటి నది వంతెనపైకి దిగాడు. తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఇలా చేయడం వల్ల మిగతా రైళ్లు ఆలస్యం అవ్వకుండా అయింది. చాలా మంది ప్రయాణికులకు ఊరట కలిగినట్లయింది’’ అని రైల్వే శాఖ అధికార ప్రతినిధి సుతార్ చెప్పారు. సీనియర్ రైల్వే అధికారులు కూడా లోకో పైలట్ చేసిన పని పట్ల ప్రశంసలు కురిపించారు. అతను అంకితభావంతో, క్లిష్టమైన సమయంలో బాగా వ్యవహరించారని అన్నారు. 


సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, అలారం చైన్ నాబ్‌ని రీసెట్ చేయడానికి నది వంతెన మధ్యలో ఆగిపోయిన ఛప్రా-బౌండ్ గోదాన్ ఎక్స్‌ప్రెస్ చక్రాల మధ్యలోకి వెళ్లిన ఏఎల్పీ సతీష్ కుమార్ అలారం చైన్ నాబ్‌ను రీసెట్ చేశాడు. చైన్ లాగితే రైలు ఆగిపోతుంది. రైలు మళ్లీ నడవాలంటే, లాగిన కోచ్‌లో నాబ్‌ను రీసెట్ చేయడం తప్పనిసరి.


కేంద్ర మంత్రి ప్రశంసలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన లోకో పైలట్ ధైర్య సాహస వీడియోపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా స్పందించారు. ఆ వీడియోను రీట్వీట్ చేశారు. అసిస్టెంట్ లోకో పైలట్ నిబద్ధతను ప్రశంసించారు. 






ప్రయాణికులు రైలులో అనవసరంగా చైన్ లాగవద్దని ఈ సందర్భంగా రైల్వే శాఖ అభ్యర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుండి 30 మధ్య ముంబయి డివిజన్‌లోనే 197 అలారం చైన్ లాగడం వంటి సంఘటనలు నమోదయ్యాయి.