King Charles 3: ఈ ఏడాది మే నెల 6వ తేదీన అధికారికంగా జరగనున్న బ్రిటన్ రాజు ఛార్లెస్-3, కెమిల్లా దంపతుల పట్టాభిషేక మహోత్సవంలో శతాబ్దాల సంప్రదాయానికి నూతన చక్రవర్తి స్వస్తి పలకనున్నట్లు సమాచారం. పట్టాభిషేకం సమయంలో సాంప్రదాయ రాజు దుస్తులను ధరించడానికి ఆయన ఒప్పుకోనట్లు తెలిసింది. ఈ ఆచారానికి కొత్త రాజు దూరంగా ఉండనున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఇండిపెండెంట్ వెల్లడించింది. మునుపటి పట్టాభిషేకాలలో, చక్రవర్తి సాంప్రదాయకంగా పట్టు మేజోళ్ళు, బ్రీచ్‌లను ధరించేవారు. అయితే కింగ్ చార్లెస్ ఈ సంప్రదాయాన్ని మరియు అనేక పురాతన ఆచారాలను విడిచిపెట్టబోతున్నట్లు వివరించారు. 


రాజు దుస్తులకు బదులుగా సైనిక యూనిఫాంలో పట్టిభిషేకానికి హాజరయ్యే అకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ సలహాదారులను సంప్రదించిన తర్వాత కొత్త చక్రవర్తి ఈ నిర్ణయానికి వచ్చారని బకింగ్ హోమ్ ప్యాలెస్ వర్గాల ద్వారా సమాచారం. సంప్రదాయ దుస్తులు కాలం చెల్లినవిగా భావించడం వల్లే బ్రిటన్ చక్రవర్తి చార్లెస్-3 ఈ నిర్ణయానికి తీసుకున్నారని తెలుస్తోంది. వెస్ట్ మినిస్టర్ అబేలో మే నెల 6వ తేదీన చార్లెస్, అతని భార్య కెమిల్లా పట్టాభిషేక వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ మరుసటి రోజు విండ్సర్ కాజిల్ పట్టాభిషేక కచేరీని కూడా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని అతి పెద్ద వినోదకారులతో సంగీతం, ఆర్కెస్ట్రా కూడా ఉండబోతోంది. కార్యక్రమానికి కొన్ని వేల మంది సామాన్య ప్రజలను కూడా అనుమతించనున్నారు. అలాగే వీరికి భోజన వసతి కూడా కల్పించబోతున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. 


ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 గత ఏడాది సెప్టెంబర్ లో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె మరణం తర్వాత బ్రిటన్ కు కొత్త రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే పట్టాభిషేకం నిర్వహించబోతున్నారు. అయితే రాజు పట్టాభిషేకానికి ఏ రాజ కుటుంబ సభ్యులు హాజరవుతారో ప్యాలెస్ ఇంకా వెల్లడించలేదు. దాదాపు 240 కోట్ల జనాభా కల్గిన 56 స్వతంత్ర దేశాల కామన్ వెల్త్ కూటమికి ఛార్లెస్ నాయకుడిగా ఉన్నారు. వీటిలో 14 దేశఆలకు, బ్రిటన్ కు ఆయన అధినేతగా ఉంటున్నారు.