Kerala Menstrual Leave for Schoolgirls: అక్షరాస్యతలోనూ, సామాజిక సంస్కరణల్లో ఎప్పుడూ దేశానికి మార్గదర్శిగా నిలిచే కేరళ రాష్ట్రం, మహిళా సాధికారత దిశగా మరో చారిత్రాత్మక అడుగు వేసింది. కేరళలోని నూతన యూడీఎఫ్‌ ప్రభుత్వం విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల కోసం, పని ప్రదేశాల్లో మహిళల కోసం విప్లవాత్మకమైన  మార్పులు ప్రతిపాదించింది. ప్రాజెక్టు మెన్‌స్ట్రువల్‌ డిగ్నిటీ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు దేశ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

Continues below advertisement

ఏంటీ ఈ ప్రాజెక్టు మెన్‌స్ట్రువల్‌ డిగ్నిటీ

ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం పాఠశాల విద్యార్థినులకు సంబంధించింది. నెలసరి సమయంలో బాలికలు ఎదుర్కునే శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని వారికి ప్రతి నెల మూడు రోజుల పాటు సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా కేరళ పాఠశాల స్థాయిలోనే ఇటువంటి సౌకర్యాన్ని కల్పించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది. 

ఈ పథకం అమలు కేవలం సెలవు ఇవ్వడానికే పరిమితం కాలేదు. విద్యార్థినులు ఆ మూడు రోజులు పాఠశాలకు రాకపోవడం వల్ల చదువుల్లో వెనకుబడిపోతారనే ఆందోళన కలగకుండా ప్రభుత్వం ఒక వినూత్న పరిష్కారం ఆలోచించింది. సెలవు తీసుకున్న విద్యార్థినుల కోసం వారాంతాల్లో ప్రత్యేక క్యాచప్ క్లాసెస్‌ నిర్వహిస్తారు. దీని వల్ల వారు కోల్పోయిన పాఠాలు తిరిగి నేర్చుకునే అవకాశం ఉంటుంది. గతంలో కేరళలోని కొన్ని యూనివర్సిటీల్లో ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడు దీనిని వడీ సతీశన్ నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాల స్థాయికి విస్తరించింది. 

Continues below advertisement

మహిళల ఆరోగ్యం, ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నెలసరి సమయంలో విద్యార్థినులు పాఠశాలకు రావడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, వారి ఆరోగ్యంపై చూపే ప్రభావం, ఆ సమయంలో వారికి అవసరమైన విశ్రాంతిని అందించడం ద్వారా వారిని విద్యాపరంగా మరింత ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేరళను దేశంలోనే అత్యంత ఉమెన్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. 

మహిళా ఉద్యోగులకు తీపి కబురు 

కేవలం విద్యార్థినులకే కాకుండా, పని చేసే మహిళల కోసం కూడా కేరళ ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు ప్రకటించింది. పని ప్రదేశాల్లో పురుషులో సమానంగా మహిళలకు కూడా వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. లింగ వివక్ష లేకుండా సమానం పనికి సమాన వేతనం అనే రాజ్యాంగ సూత్రాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడమే దీని లక్ష్యం.  

1961 నాటి ప్రసూతి ప్రయోజనాల చట్టం కింద చైల్డ్‌ కేర్ రూల్స్ ను ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. దీని ప్రకారం 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ఇతర ప్రైవేటు కార్యాలయాల్లో తప్పనిసరిగా డే కేర్, క్రెచ్‌‌ సౌకర్యాలను కల్పించాలి. దీని వల్ల ప్రసవం తర్వాత మహిళలు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిన అవసరం ఉండదు.

కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టు మెన్‌స్ట్రువల్‌ డిగ్నిటీ, సమానవేతన చట్టాలు విజయవంతమైతే, ఇవి భవిష్యత్‌లో మిగిలిన రాష్ట్రాలకు కూడా రోల్‌మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది.