కేరళలోని మలప్పురం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగి 21 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తానూర్‌లోని తువాల్ తేరం పర్యాటక ప్రదేశంలో జరిగింది. ఇప్పటివరకు 21 మృతదేహాలను వెలికితీశామని రీజినల్ ఫైర్ రేంజ్ ఆఫీసర్ షిజు కేకే తెలిపారు. బోటులో ఎంతమంది కూర్చున్నారనేది ఇంకా తెలియరాలేదు. 


సమాచారం అందిన వెంటనే పలు వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కాగా, ఈ ఘటన నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అర్ధరాత్రి రాష్ట్ర ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, పోస్టుమార్టం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు. 






సంతాపం తెలిపిన సీఎం పినరయి విజయన్


మలప్పురంలో పడవ మునిగిన ఘటనలో ప్రాణనష్టంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేస్తూ సహాయక చర్యలు వేగంగా చేయాలని ఆదేశించారు. మలప్పురంలోని తానూర్ బోటు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం బాధాకరమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. సహాయక చర్యల్లో సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.






పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ


ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు.






రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం 


కేరళలోని మలప్పురంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. అని ట్వీట్ చేశారు.