Oommen Chandy Death: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మంగళవారం (జూలై 18) కన్నుమూశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. 79 ఏళ్ల చాందీ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులు, కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సుధాకరన్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 


'ప్రేమ' అనే శక్తితో ప్రపంచాన్ని జయించిన రాజు కథ ముగిసిందని కె.సుధాకరన్ ట్వీట్ చేశారు. ఈ రోజు సీనియర్ ఊమెన్ చాందీ మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన చాలా మంది వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేశారని, ఆయన వారసత్వం మనస్సాక్షిలో ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తుందని అన్నారు.


చాలా కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గొంతు సమస్యతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఊమెన్ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్‌లో పుట్టారు. 27 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి పూతుపల్లి నుంచి విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి అదే నియోజవర్గం నుంచి 12 సార్లు గెలుస్తూ వచ్చారు. 1977లో తొలిసారిగా మంత్రి అయ్యారు. అలా పార్టీ నాయకత్వానికి విధేయత ప్రకటిస్తూ వచ్చారు. అలా ఆయన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రిని చేసింది. 2004 నుంచి 2006 వరకు, 2011 నుంచి 2016 వరకు రెండు పర్యాయాలు సీఎం కుర్చీలో కూర్చున్నారు చాందీ. 










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial