Kerala Name Change To Keralam: కేరళ పేరు (Kerala Rename)ను కేరళంగా మార్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. అ రాష్ట్ర అసెంబ్లీ మొదటిసారి చేసిన తీర్మాణాన్ని సాంకేతిక కారణాలతో కేంద్రం తిరస్కరించింది. తాజాగా అసెంబ్లీ (Kerala Assembly) సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) మరోసారి రాష్ట్రం పేరు మార్చే బిల్‌ని ప్రవేశపెట్టారు. దానిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిని మరోసారి కేంద్రానికి పంపనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. చాలా కాలంగా రాష్ట్రం పేరు మార్పు డిమాండ్ కేరళలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చరిత్రను దృష్టిలో పెట్టుకుని పేరు మారిస్తే బాగుంటుందని పినరయి విజయన్ ప్రభుత్వం భావించింది. 


రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చబడిన అన్ని భాషలలో "కేరళ" పేరును "కేరళం"గా మార్చాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెడుతూ విజయన్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని మలయాళంలో కేరళ అని పిలిచేవారని, మలయాళం మాట్లాడే వారి కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి బలంగా ఉందని సీఎం చెప్పారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో తమ రాష్ట్రం పేరు కేరళ అని రాసి ఉందని, దానిని కేరళంగా సవరించాలని కేంద్రాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో ‘కేరళ’ పేరును ‘కేరళం’ మార్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మాణం చేసినట్లు  చెప్పారు.


ఇది రెండో తీర్మానం
‘కేరళ’ పేరును ‘కేరళం’గా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం ఇది రెండోసారి. తొలిసారి గత ఏడాది ఆగస్టులో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి సమర్పించింది. అయితే అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందులో కొన్ని సాంకేతిక మార్పులను సూచించింది. ఈ నేపథ్యంలో తాజగా మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రం చేసిన మార్పులకు ఆమోదం తెలుపుతూ రెండో సారి అసెంబ్లీ తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని అధికార ఎల్‌డీఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సభ్యులు ఇద్దరూ ఆమోదించారు. అయితే అంతకు ముందు యూడీఎఫ్ శాసనసభ్యుడు షంసుద్దీన్ చేసిన సవరణలను ప్రభుత్వం తిరస్కరించింది. అనంతరం తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రకటించారు.


చాలా కాలంగా డిమాండ్
రాష్ట్రం పేరు మార్చాలనే డిమాండ్ కేరళలో చాలా కాలంగా ఉంది. రాష్ట్ర సాంస్కృతిక ప్రాధాన్యత, చరిత్రను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని డిమాండ్లు ఉన్నాయి. రాష్ట్ర సాంస్కృతిక, భాషావేత్తలు సైతం ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించారు.  పేరు మార్పుతో రాష్ట్ర సంస్కృతిని చాటి చెప్పినట్టు అవుతుందని, మూలాలు మర్చిపోలేదన్న సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని వివరించారు. చరిత్రలో కేరళ పేరు ‘కేరళం’గానే ఉందని, మలయాళ భాష పరంగా సరైన పేరు అని సూచించారు. రాష్ట్రం పేరు మార్పుతో కేరళ సంస్కృతిని, చరిత్రను గౌరవించినట్టు అవుతుందని పలువురు భాషావేత్తలు తెలిపారు. దీంతో రాష్ట్రం పేరు మార్చేందుకు పినరయి విజయన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం పినరయి విజయన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
 
ఇప్పుడు ఎందుకు ఈ తలనొప్పి?
కేరళ పేరు ప్రతిపాదనకు మద్దతుతో పాటు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం పేరు కేరళంగా పేరు మార్చితే పరిపాలనా వ్యవహారాల్లో చాలా మార్పులు చేయాల్సి వస్తుందని పలువురు వాదిస్తున్నారు. పేరు మార్పుతో లేని పోని తలనొప్పి కొనితెచ్చున్నట్లు అవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందడంతో కేంద్ర ప్రభుత్వానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి సారి తీర్మానానికి తిరస్కరించిన నేపథ్యంలో రెండో సారి కేంద్రహోం మంత్రిత్వ శాఖ అమోదిస్తుందా లేదా అనే  ఆసక్తి, ఉత్కంఠ ఏర్పడింది.