Kerala: కేరళలోని కొల్లాం ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ ఆర్మీ జవానుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నిషేధిక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన దుండగులు ఆర్మీ జవాను చేతులను టేపుతో కట్టేసి అతడిపై తీవ్రంగా దాడి చేశారు. అలాగే జవాను వీపు వెనక షర్ట్ చించేసి PFI అని ఆంగ్ల అక్షరాలతో రాశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్మీ జవాను తన వీపుపై పెయింట్ వేసిన PFI (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) అక్షరాలను చూపుతున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.


ఈ వీడియో నేపథ్యంలో కడక్కల్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత ఆర్మీ జవాన్ పేరు షైన్ కుమార్ గా అధికారులు గుర్తించారు. ఆరుగురు వ్యక్తులు ఆర్మీ జవాను అయిన షైన్ కుమార్ ను ఆదివారం నాడు తన ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. కడక్కల్ లోని రబ్బరు తోటల్లోకి బలవంతంగా లాక్కెళ్లి తనపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టిన అనంతరం వీపుపై PFI అని రాసి పరారైనట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడి వెనక కారణం ఏంటి అనేది మాత్రం తెలిసిరాలేదు. సదరు ఆర్మీ జవాను ఎలక్ట్రానిక్స్, మెకానికల్ కేడర్ తో ఆ అధికారి రాజస్థాన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.


మరోవైపు కేరళలోని నిషేధిత ఇస్లామిక్ సంస్థకు చెందిన మాజీ సభ్యులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం, వయనాడ్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత సంస్థకు నిధులు అందుతున్నాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద గత ఏడాది సెప్టెంబర్ లో PFI (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ను చట్టవిరుద్ధ సంఘంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పీఎఫ్ఐ పై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.


అయితే ఎస్డీపీఐతో కలిసి యువజన ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ నాయకులు, కార్యకర్తలు చురుకుగా కొత్త సభ్యులను చేర్చుకుంటున్నట్లు నివేదికలు వస్తున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం ్య్యారు. యువకులతో కూడిన కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయడం గురించి విస్తృత చర్చలు కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.


ఆగస్టు నెలలో మలప్పురంలోని పలువురు పీఎఫ్ఐ కార్యకర్తల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు చేసింది. పీఎఫ్ఐ అతి పెద్ద, పురాతన ఆయుధాలు, శారీరక శిక్షణా కేంద్రాల్లో ఒకటైన మంజేరిలోని గ్రీన్ వ్యాలీ అకాడమీని ఎన్ఐఏ అటాచ్ చేసింది. ఆ తర్వాతే ఈ సోదాలు జరిగాయి.