Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal)...దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన గురించే చర్చ జరుగుతోంది.  ఎందుకంటే దిల్లీ ముఖ్యమంత్రి ఉండగానే...లిక్కర్ కుంభకోణం (Delhi Liquor Scam)లో అవినీతి ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ఇండియన్ రెవెన్యూ సర్వీసు నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు అరవింద్ కేజ్రీవాల్ పేరే సంచలనం. సామాజిక కార్యకర్త అన్నా హాజారే (Anna Hazare )తో కలిసి...ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి...సెంటరాఫ్ అట్రాక్షన్ నిలిచారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో కేజ్రీవాల్ కు రామన్ మెగసెసే అవార్డు కూడా లభించింది. అయితే అవినీతికి వ్యతిరేకంగా నాడు పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్...నేడు అవినీతి ఆరోపణలతో అరెస్టవుతానని కలలో కూడా ఊహించి ఉండరు. 


ఐఆర్ఎస్ అధికారి నుంచి ముఖ్యమంత్రి దాకా...


1992లో ఇండియన్  రెవెన్యూ సర్వీసులో చేరిన కేజ్రీవాల్...2004 వరకు పని చేశారు. ఆ తర్వాత జన లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం చేశారు. సమాచార హక్కు చట్టం కోసం పోరాడటంతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు, లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలంటూ అన్నా హాజారే దీక్షకు దిగారు. దిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.  13 రోజుల తర్వాత అన్నా హజారే నిరాహార దీక్షను విరమించారు. సమాచార హక్కు చట్టం తీసుకురావటంతో కేజ్రీవాల్ కు 2006 లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించడంతో కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా రాజకీయాల్లోకి రాకముందు...కొంతకాలం అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించారు. 


రాజకీయాల్లో కేజ్రీవాల్ సంచలనం


పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు అరవింద్ కేజ్రీవాల్. 2012 నవంబరు 26న ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సొంతంగా పార్టీని స్థాపించారు. 2013లో దిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ...28 స్థానాల్లో విజయం సాధించింది. కేజ్రీవాల్ మొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. 50 రోజులు కూడా గడవకముందే పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను...ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 67 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. అక్కడి నుంచి అరవింద్ కేజ్రీవాల్ పేరు దేశ రాజకీయాల్లో మార్మోగిపోయింది. పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడంతో...కేజ్రీవాల్ ఇమేజ్ మరింత పెరిగిపోయింది. ఏప్రిల్ 10, 2023న ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను ఇచ్చింది. గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, గుజరాత్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. దీంతో రెండు కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీగా ఆప్ పేరు గడించింది. 


లిక్కర్ కేసులో పలువురు అరెస్టు


లిక్కర్ కేసులో ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత, శరత్ చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవ్ రెడ్డిలు అరెస్టయ్యారు. మాగుంట రాఘవ్ రెడ్డి అప్రూవర్ మారిపోవడంతో బెయిల్ వచ్చింది. దీంతో ఆయన బెయిల్ పై విడుదల య్యారు.  లిక్కర్ కేసులో అరెస్టయిన వారంతా తిహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ కేసు అవినీతి సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికలకు వాడినట్లు ఈడీ ఆరోపిస్తోంది.