Karnataka Bus Accident: క్రిస్మస్ పండుగ వేళ కర్ణాటక రాష్ట్రంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా, మృత్యువు అగ్ని రూపంలో వచ్చి కబళించింది. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది  ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఒక ప్రైవేటు బస్‌, కంటెయినర్‌ లారీ ఢీ కొనడంతో రేగిన మంటలు క్షణాల్లో విస్తరించి పెను విషాదాన్ని నింపాయి. 

Continues below advertisement

సీబర్డ్‌ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి గోకర్ణవైపు వెళ్తుండగానే ప్రమాదం జరిగింది. గురువారం వేకువ జామున సుమారు 2.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలో జాతీయ రహదారి-48పై గోర్లత్తు క్రాస్ వద్ద ఈ దారుణం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎదురుగా వస్తున్న ఒక కంటెయినర్‌ లారీ అదుపు తప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు వస్తున్న బస్సును బలంగా ఢీ కొట్టింది. ఢీ కొన్న వేగానికి రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

నిద్రలోనే మృత్యు ఒడిలోకి

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో, లోపల ఉన్నవారు ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. దట్టమైన పొగ కారణంగా ఏవైపు వెళ్లాలో తెలియక 17 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు విడిచారు. అతి వేగం, ఆ సమయంలో ఉన్న పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 

Continues below advertisement

ప్రాణాలు కాపాడుకున్నవారు

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ , కో డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగులగొట్టి బయటకు రాగలిగారు. ఇలా బయట పడ్డ వాళ్లు తమ బంధువులు, స్నేహితులు కళ్ల ముందే అగ్నికి ఆహుతైపోతుంటే కన్నీరుమున్నీరుగా విలపించారు. గాయపడిన ఇతర ప్రయాణికులను అధికారులు తక్షణమే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. 

మృతులను గుర్తించే ప్రక్రియను పోలీసులు చేపట్టారు. అధికారులు ప్రస్తుతానికి సేకరించిన సమాచారం ప్రకారం బస్‌లో మంజునాథ్‌, అమృత, కల్పన, సంధ్య, దిలీప్, శశాంక్, బిందు, కవిత, ప్రీతీశ్వరన్‌, అనిరుధ్‌ బెనర్జీ, ప్రజాపతి, విజయ్ భండారీ, శశికాంత్‌, నవ్య, కిరణ్‌పాల్, అభిషేక్, కీర్తన్‌ ఉన్నట్టు తెలుస్తోంది.