కర్ణాటక నూతన సీఎం వ్యవహారం మంగళవారం తేలే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఆహ్వానం మేరకు మాజీ సీఎం సిద్ధరామయ్య సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య నిన్న, ఈరోజు భేటీ కాగా.. కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం పార్టీ అధ్యక్షుడు ఖర్గే నివాసానికి వెళ్లి శివకుమార్ భేటీ అయ్యి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో ఖర్గే వేర్వేరుగా భేటీ అయ్యి అన్ని విషయాలు చర్చించారు. ఇద్దరు నేతల అభిప్రాయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తెలిపిన తరువాత సీఎంపై నిర్ణయం తీసుకోవాలని ఖర్గేను కోరారు. 


సిద్ధరామయ్య, శివకుమార్ లతో తన నివాసంలో విడివిడిగా ఖర్గే భేటీ ముగిసింది. అనంతరం అసలు సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం రేసులో ఉన్న ఈ నేతలతో భేటీలో చర్చించిన విషయాలను మల్లికార్జున ఖర్గే నేటి రాత్రి సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈ ఇద్దరు నేతల అభిప్రాయాలను ఖర్గే తెలపడంతో పాటు పార్టీ భవిష్యత్, కర్ణాటకలో పార్టీ బలోపేతం కోసం ఎవరికి పగ్గాలు ఇవ్వాలి అనేది ఉత్కంఠ రేపుతోంది. పరిస్థితి గమనిస్తే కర్ణాటక నూతన సీఎం ఎవరనేది బుధవారం తేలేలా కనిపిస్తోంది. నేటి రాత్రి కాంగ్రెస్ పెద్దలు అన్ని రకాలుగా ఆలోచించి సీఎం పేరును రేపు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. 






చివరి ఎన్నికలు అని చెప్పిన సిద్ధరామయ్య గతంలోనే సీఎంగా సేవలు అందించారు. అందులోనూ ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేత. మరోవైపు కాంగ్రెస్ పార్టీతోనే మొత్తం పొలిటికల్ కెరీర్ కొనసాగించిన డీకే శివకుమార్ తనకు ఎలాగైన సీఎం పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో తన కష్టం గుర్తించి అధిష్టానం తనకు ఛాన్స్ ఇస్తుందని భావిస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని సోనియాకు మాటిచ్చాను, చెప్పినట్లుగానే గెలిపించి చూపించానంటున్నారు డీకే. ఇక అధిష్టానం తనకు అనుకూల నిర్ణయం తీసుకుంటుందని కొండంత ఆశగా ఉన్నారు.






సీఎం పదవి ఒక్కరికి ఇవ్వాలా, లేక చెరో రెండున్నరేళ్లతో మధ్యే మార్గంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే చెరో రెండున్నరేళ్లు ఇచ్చినా, మొదట తనకే ఇవ్వాలంటూ సిద్ధరామయ్య, శివకుమార్ పార్టీ హైకమాండ్ ను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు, వారి నిర్ణయాన్ని ఇదివరకే సీల్డ్ కవర్ లో సోనియా గాంధీకి కర్ణాటక కాంగ్రెస్ పరిశీలకులు సమర్పించారు. నేటి రాత్రి జరగనున్న సోనియా, రాహుల్ తో ఖర్గే సమావేశంలో కర్ణాటక సీఎంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.