సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏకాభిప్రాయానికి వచ్చారు. శనివారం (మే 20) బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
సిద్ధరామయ్య పేరును అధికారికంగా ఖరారు చేసేందుకు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి పదవికి పోటీదారులుగా ఉన్న సిద్ధరామయ్య, శివకుమార్ బుధవారం (మే 17) ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో విడివిడిగా సమావేశమయ్యారు.
బుధవారం రాత్రి సుర్జేవాలాను ఆయన నివాసంలో కలిసిన శివకుమార్ ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సుర్జేవాలాతో చర్చలు జరిపారు.
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలకు పరిమితమయ్యాయి. మే 13న (శనివారం) ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లో ఎవరు కర్ణాటక ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వినిపించింది.
సీఎంను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఆదివారం సాయంత్రం బెంగళూరులో సమావేశమైంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అధికారం పార్టీ అధ్యక్షుడికి కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
పార్టీ సీనియర్ నేతలు సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాను బెంగళూరుకు పంపిన అధినాయకత్వం ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుంది. ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ నేతలు రహస్య ఓటింగ్ కూడా నిర్వహించారు.
ఇలా రకరకాలుగా కర్ణాటక సీఎం ఎంపికపై అధినాయకత్వం కసరత్తు చేసింది. ఇద్దరూ బలమైన నాయకులు, అధినాయకత్వం వద్ద పలుకుబడి ఉన్న నాయకులైనందున పంచాయితీ ఐదు రోజుల పాటు నడిచింది. చివరకు ఇద్దరూ నెగ్గారు అనేలే మధ్యే మార్గంగా కాంగ్రెస్ హైకమాండ్ ఓ పరిష్కారాన్ని కనుగొంది.
ఏఎన్‌ఐ చెప్పిన వివరాలు పరిశీలిస్తే... సిద్దరామయ్య రెండేళ్ల పాటు సీఎంగా కొనసాగనున్నారు. అనంతరం మూడేళ్లు సీఎంగా డీకే శివకుమార్ ఉండబోతున్నారని టాక్. డిప్యూటీ సీఎం పదవితోపాటు తన అనుచరులకు ఆరు మంత్రి పదువులు ఇవ్వాలని శివకుమార్ డిమాండ్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ అధిష్ఠానం ఓకే చెప్పినట్టు సమాచారం.
చివరి ఎన్నికలు అని చెప్పిన సిద్ధరామయ్య గతంలోనే సీఎంగా సేవలు అందించారు. అందులోనూ ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేత. మరోవైపు కాంగ్రెస్ పార్టీతోనే మొత్తం పొలిటికల్ కెరీర్ కొనసాగించిన డీకే శివకుమార్ తనకు ఎలాగైన సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. ఎన్నికల్లో తన కష్టం గుర్తించి అధిష్టానం తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని సోనియాకు మాటిచ్చాను, చెప్పినట్లుగానే గెలిపించి చూపించానన్నారు డీకే. అందుకే మధ్యే మార్గంగా ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా రెండేళ్లు సిద్ధరామయ్యకు సీఎం పదవి అదే క్యాబినెట్‌లో డీకే శివకుమార్‌కు ఆరు మంత్రి పదవులు, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.