కర్ణాటక ఎపిసోడ్‌కు కాంగ్రెస్ శుభం కార్డు వేసింది. ఐదు రోజులుగా సాగుతున్న పంచాయితీకి తీర్పు ఇచ్చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే అది ఢిల్లీలో చేస్తారా లేకుంటే కర్ణాటక వెళ్లి చేస్తారా అన్నది ఇప్పటి ఇంకా స్పష్టత లేదు. 


ఏఎన్‌ఐ చెప్పిన వివరాలు పరిశీలిస్తే... సిద్దరామయ్య రెండేళ్ల పాటు సీఎంగా కొనసాగనున్నారు. అనంతరం మూడేళ్లు సీఎంగా డీకే శివకుమార్ ఉండబోతున్నారని టాక్. డిప్యూటీ సీఎం పదవితోపాటు తన అనుచరులకు ఆరు మంత్రి పదువులు ఇవ్వాలని శివకుమార్‌ డిమాండ్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ అధిష్ఠానం ఓకే చెప్పినట్టు సమాచారం. 






సోమవారం ఇరువును నేతలను ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం సుదీర్ఘంగా మంతనాలు జరిపింది. సోమవారమే సిద్దరామయ్య ఢిల్లీ చేరుకొని తన డిమాండ్‌లను అధిష్ఠానం ముందు ఉంచారు. అనారోగ్య కారణంగా ఒక రోజుల ఆలస్యంగా ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్‌ తన డిమాండ్లు వివరించారు. ఇద్దరితో విడివిడిగా ముఖాముఖీగా పలుదఫాలుగా చర్చలు జరిపిన ఖర్గే చివరకు ఇద్దర్నీ ఒప్పించారు.


 ఒకరోజు ఆలస్యంగా ఢిల్లీ వెళ్లిన శివకుమార్‌... ఖర్గేతో స్పెషల్‌గా మీట్ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఇద్దరూ చర్చించారు. ఈ సమయంలోనే శివకుమార్ తాను ముఖ్యమంత్రి అవ్వాలని ఆసక్తి చూపుతున్నట్టు చెప్పారు. శివకుమార్‌ అలా వెళ్లిపోగానే సిద్దరామయ్య ఖర్గే ఇంటికి వచ్చారు. ఆ తరవాత సిద్దరామయ్య కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ అయ్యారు. అంతకు ముందు రాహుల్ గాంధీ...ఖర్గే నివాసానికి వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం పేరు ఖరారు అంశాలపై డిస్కస్ చేశారు. మళ్లీ బుధవారం కూడా వరుస భేటీలు జరిగాయి. ముందుగా సిద్దరామయ్య సోనియా నివాసానికి వచ్చారు. రాహుల్‌తో సమావేశమయ్యారు. ఆ తరవాత డీకే శివకుమార్‌ వచ్చి రాహుల్‌ని కలిశారు. వీళ్లిద్దరితో పాటు సీఎం రేసులో ఉన్న జీ పరమేశ్వర కూడా స్పందించారు. హైకమాండ్ ఆదేశిస్తే...ఆ కుర్చీలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అర్థరాత్రి వరకు ఈ భేటీలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దర్నీ ఓ దారికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు ఖర్గే. 


చివరి ఎన్నికలు అని చెప్పిన సిద్ధరామయ్య గతంలోనే సీఎంగా సేవలు అందించారు. అందులోనూ ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేత. మరోవైపు కాంగ్రెస్ పార్టీతోనే మొత్తం పొలిటికల్ కెరీర్ కొనసాగించిన డీకే శివకుమార్ తనకు ఎలాగైన సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. ఎన్నికల్లో తన కష్టం గుర్తించి అధిష్టానం తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని సోనియాకు మాటిచ్చాను, చెప్పినట్లుగానే గెలిపించి చూపించానన్నారు డీకే. అందుకే మధ్యే మార్గంగా ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా రెండేళ్లు సిద్ధరామయ్యకు సీఎం పదవి అదే క్యాబినెట్‌లో డీకే శివకుమార్‌కు ఆరు మంత్రి పదవులు, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.