Karnataka Election 2023 Live Updates: మధ్యాహ్నం 3 గంటల సమయానికి 52.03% పోలింగ్

Karnataka Election 2023 Live Updates: 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. మే 13 న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ABP Desam Last Updated: 10 May 2023 03:42 PM
52.03% పోలింగ్

మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 52.03% పోలింగ్ నమోదైంది. 





ఓటు వేసిన కిచ్చ సుదీప్

నటుడు కిచ్చ సుదీప్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలబ్రిటీలా కాకుండా బాధ్యత గల పౌరుడిగా వచ్చి ఓటు వేసినట్టు వెల్లడించారు. 





ఓటు వేసిన దేవెగౌడ

జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 





37.25% పోలింగ్

మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ 37.25%కి చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 

ఓటు వేసిన రిషబ్ షెట్టి

కాంతార ఫేమ్ రిషబ్ షెట్టి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉడిపి వద్ద పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 





పుంజుకున్న పోలింగ్



నత్త నడకన సాగిన కర్ణాటక పోలింగ్ వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 20.94%గా నమోదైంది. 




కింగ్‌ మేకర్ కాదు, కింగ్‌నే: కుమారస్వామి

"జేడీఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సరైన అభివృద్ధి మాతోనే సాధ్యం. మా పార్టీ కింగ్‌మేకర్ మాత్రమే కాదు. కింగ్‌గా కూడా నిలదొక్కుకోగలదు"
హెచ్‌డీ. కుమారస్వామి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్  

హామీలు నెరవేర్చుతాం: రాహుల్ గాంధీ

"కర్ణాటక అభివృద్ధి కోసం మేం 5 హామీలు ఇచ్చాం.  మహిళల హక్కులు కాపాడటం, ఉద్యోగాలు, పేద ప్రజలు సంక్షేమ పథకాలు..ఇలా ఎన్నో వాటికి మేం కట్టుబడి ఉన్నాం. అందుకే కర్ణాటక అభివృద్ధికి మీరంతా కలిసి ఓటు వేయండి"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 

జేడీఎస్‌ లేకుండానే గెలుస్తాం: డీకే శివకుమార్

జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోకుండానే తాము మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. 

కాంగ్రెస్‌కి 130-150 సీట్లు : సిద్దరామయ్య

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 130-150 వరకూ సీట్లు వస్తాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అన్నారు. 

ఉదయం 9 గంటల వరకు 8.26 శాతం పోలింగ్

ఉదయం 9 గంటల వరకు 8.26 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఓటు హక్కు వినియోగించుకున్న కన్నడ నటి అమూల్య

సెలబ్రిటీలు కూడా  ముందుగానే తరలి వచ్చి కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. కన్నడ నటి అమూల్య తన భర్తతో కలిసి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..

ఓటు వేసిన అనంతరం నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. ఎన్నికలు అనేది మీకు నిర్ణయించే హక్కు ఉన్న ప్రదేశం. కర్ణాటకను సుందరంగా తీర్చిదిద్దాలి. సామరస్యాన్ని కాపాడుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటక హోంమంత్రి

కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి తీర్థహళ్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత అందరూ కెమెరాలకు వేలి గుర్తును చూపించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్ యడ్యూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప శివమొగ్గ, షికారిపురలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన వెంట కుమారుడు విజయేంద్ర, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఓటేయండి: నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బెంగళూరులో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, కర్ణాటకలో పరిశ్రమలకు మరింత ఊతమిచ్చేందుకే తాను ఓటు వేశానని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఓటు వేశాను.

ఓటు వేసే ముందు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన బొమ్మై

షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఓటు వేసే ముందు హుబ్లీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ తమ పార్టీ, కార్యకర్తలు, నాయకులు ప్రచారంపై చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. కర్ణాటక అభివృద్ధి కోసం ఉత్సాహంగా ఓటు వేయాలని కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

ఓటు హక్కు వినియోగించుకున్న సిద్ధలింగస్వామి

సిద్ధగంగ మఠాధిపతి సిద్ధలింగ స్వామి తుమకూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 





ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు ప్రకాశ్ రాజ్

నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరులోని శాంతి నగర్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రకాష్ రాజ్ ఓటు వేసేందుకు వచ్చారు.




ఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

కర్ణాటకలో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.





కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం



కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో పలువురు సీనియర్ల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం కానుంది.






 

కర్ణాటకలో ఓటేయనున్న 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది

మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న విడుదల అవుతాయి. మొత్తం 224 స్థానాలకు ఒకే దఫాలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది బుధవారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 58, 545 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,615 మంది అభ్యర్థులు తమ లక్ పరీక్షించుకోనున్నారు.

Background

Karnataka Election 2023 Live Updates:  కర్ణాటకలో ఎన్నికల ప్రచారం మే 8న సాయంత్రం ముగియగా, మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న విడుదల అవుతాయి. మొత్తం 224 స్థానాలకు ఒకే దఫాలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది బుధవారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 58, 545 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,615 మంది అభ్యర్థులు తమ లక్ పరీక్షించుకోనున్నారు.


దాదాపు నెల రోజులుగా కాంగ్రెస్, బేజేపీ పోటాపోటీగా ప్రచారం సాగించాయి. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. ఆయనతో పాటు అమిత్ షా లాంటి కేంద్ర మంత్రులు, కీలక నేతలు, నటీనటులు సైతం హోరాహోరీగా ప్రచారం చేశారు.  కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌లుగా రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ప్రజల్లో ఉత్సాహం నింపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికే మరోసారి అవకాశమివ్వాలంటూ మోదీ ప్రచారం చేశారు. అటు కాంగ్రెస్ మాత్రం బీజేపీపై విమర్శలు చేస్తూ ప్రచారం కొనసాగించింది. సీఎం బసవ రాజ్ బొమ్మై పనితీరుపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తున్నా, ప్రధాని మోదీ చరిష్మా కారణంగా కర్ణాటకలో కమలదళం పటిష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటే మాత్రం బీజేపీకి ఇబ్బందులు తప్పవు.


క్యాంపెయినింగ్ చివరి దశకు చేరుకునే సమయానికి కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన తరవాత మాటల యుద్ధం పెరిగింది. బజ్‌రంగ్ దళ్‌ బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటన అగ్గి రాజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలందరూ దీన్నే ప్రచార అంశంగా మలుచుకున్నారు. కాంగ్రెస్‌కు గురి పెట్టారు. చివరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించి "యూటర్న్" తీసుకోవాల్సి వచ్చింది. ఇది కొంత మేర కాంగ్రెస్‌పై ప్రభావం చూపించే అవకాశముంది. కాంగ్రెస్ బీజేపీపై "40% కమీషన్" ప్రభుత్వం అని విమర్శలు చేస్తూ ప్రచారం సాగించింది. బసవరాజు బొమ్మై పని తీరుపైనా అసహనం వ్యక్తం చేసింది. అవినీతి ప్రభుత్వం అంటూ పదేపదే విమర్శలు చేసింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ ఇదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేశారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో భారత్ దేశాన్ని ప్రపంచం గుర్తించలేదని, తాము అధికారంలోకి వచ్చాకే దేశ ప్రతిష్ఠ పెరిగిందంటూ జాతీయవాదాన్ని నూరిపోశారు ప్రధాని. కాంగ్రెస్ హయాంలో మొత్తం స్కామ్‌లే జరిగాయని మండి పడ్డారు. బజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న హామీపైనా పరోక్షంగా విమర్శలు చేశారు. జై బజ్‌రంగ్ బలి అనే నినాదాలతో ప్రసంగాలు మొదలు పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు.  అటు కాంగ్రెస్ కూడా ప్రధాని విమర్శలకు కౌంటర్‌లు ఇచ్చినా...ఖర్గే నోరు జారడం వల్ల కాస్త చెడ్డ పేరు మూట కట్టుకోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ విషసర్పం అంటూ ఖర్గే చేసిన కామెంట్స్ మిస్‌ఫైర్ అయ్యాయి. చివరకు ఆయనే వివరణ ఇచ్చుకున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.