Karnataka Assembly Election 2023 BJP Releases Third Candidate List: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇదివరకే రెండు జాబితాలుగా అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. బీజేపీ సోమవారం 10 మంది అభ్యర్థులతో మూడవ జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పోటీ చేసే హుబ్లీ- ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిని సైతం ప్రకటించారు. మహేష్ టెంగినకైని ఆ స్థానం నుంచి బీజేపీ బరిలో నిలపడం కర్ణాటక పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


మూడో జాబితా గమనిస్తే.. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి భార్య మంజులా అరవింద్ లింబావలి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మహదేవపుర నుంచి బరిలోకి దిగుతున్నారు. వారితో పాటు నాగథాన్ నుంచి సంజీవ్ ఐహోళే, సేడం నుంచి రాజ్ కుమార్ పాటిల్, కొప్పల్ నుంచి మంజుల అమరేష్, రాన్ నుంచి కలకప్ప బండి, హగరి బొమ్మనహళ్లి నుంచి బి. రామన్న, హెబ్బాల్ నుంచి కట్టా జగదీష్, గోవింద రాజ్ నగర్ నుంచి ఉమేష్ శెట్టి, కృష్ణరాజ నియోజకవర్గం నుంచి శ్రీవత్సకు బీజేపీ అవకాశం ఇచ్చింది. 






ఆదివారం బీజేపీకి రాజీనామా చేసిన మాజీ సీఎం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీష్ షెట్టర్ పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. హైకమాండ్ తీరుతో విసిగిపోయాయని, టికెట్‌ ఇవ్వకపోవడం బాధించిందని వెల్లడించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. "బీజేపీ హైకమాండ్ తీరు నన్ను చాలా బాధించింది. అందుకే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను. కొంత మంది లీడర్‌లు కర్ణాటకలోని బీజేపీని మిస్ హ్యాండిల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రిజైన్ చేసేస్తాను. ఆ తరవాతం ఏం చేయాలో త్వరలోనే నిర్ణయించుకుంటాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా..? వేరే పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలా అన్నది ఆలోచిస్తున్నాను" - జగదీష్ షెట్టర్


కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ శెట్టర్
ఆదివారం బీజేపీకి రాసిన 24 గంటల్లోనే హస్తం గూటికి చేరారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్. సోమవారం ఉదయం బెంగళూరులో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మల్లికార్జున్ ఖర్గే, పార్టీ కర్ణాటక విభాగం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రణదీప్ ఎస్ సుర్జేవాలా, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లు జగదీష్ శెట్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న షెట్టర్‌కు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు. తనను అవమానించారని, అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీజేపీపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. అయితే తాను గతంలో పోటీ చేసిన హుబ్లీ- ధార్వాడ్ సెంట్రల్ నుంచి జగదీష్ శెట్టర్ కు కాంగ్రెస్ సీటు ఇస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది.