Kargil Vijay Diwas 2022: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ.. కార్గిల్ వీరుల త్యాగాలను, శౌర్య పరాక్రమాలను గుర్తు చేసుకున్నారు. అయితే అసలు కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల వీర పరాక్రమాల గురించి ఓసారి తెలుసుకుందాం.






భారత సైన్యం చరిత్రలోనే కార్గిల్​ యుద్ధం ఓ మైలురాయి. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన యుద్ధమది. ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకుని నిల్చొనేలా చేసింది.


2 నెలల పాటు


సరిహద్దు రేఖ వెంబడి జమ్ముకశ్మీర్​లోని కార్గిల్​లో దాయాది పాక్​తో 1999 మే 3న ప్రారంభమైన యుద్ధం 2 నెలల 23 రోజుల పాటు సాగి జులై 26తో ముగిసింది. అదే రోజు పాక్​ అక్రమ చొరబాటుదారులను పూర్తిగా తరిమికొట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. గొప్ప విజయానికి ప్రతీకగా ఏటా జులై 26న కార్గిల్​ దివస్​గా జరుపుకుంటాం. దీనినే 'ఆపరేషన్​ విజయ్'​గానూ పిలుచుకుంటారు.


కార్గిల్​ సమయంలో అటల్​ బిహారీ వాజ్​పేయీ భారత ప్రధానిగా ఉన్నారు. నవాజ్​ షరీఫ్​ పాకిస్థాన్​ ప్రధాని. నియంత, మాజీ పీఎం పర్వేజ్​ ముషారఫ్​ అప్పటి పాక్​ సైన్యాధిపతి.


భారత జవాన్లు శత్రుమూకలను నియంత్రణ రేఖ నుంచి అవతలకు తరిమే వరకూ అలుపన్నదే లేకుండా పోరాడారు. అయితే యుద్ధ క్షేత్రంలోనే కాకుండా.. దౌత్యపరంగానూ పాక్‌ను మట్టికరిపించింది భారత్. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ఆగడాలను బట్టబయలు చేసింది. సైనిక శక్తి పరంగానే కాక దౌత్యపరంగానూ భారత్‌ ఎంత బలమైనదో పాక్‌కు ప్రత్యక్షంగా రుచి చూపించింది కార్గిల్‌ యుద్ధం.


యుద్ధంలోనూ న్యాయం


కార్గిల్‌ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్‌ సాధించిన విజయం అనేక కోణాల్లో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాటి యుద్ధం భారత సైన్యం సత్తాను ప్రపంచానికి చాటడమే కాదు.. దౌత్య వ్యూహాల పదునును కూడా తెలియజేసింది. అంతేకాకుండా అంత యుద్ధం జరిగినా, చివరకు భారీ విజయం లభించినా.. భారత సేనలు సరిహదుల్లో ఎక్కడా నియంత్రణరేఖ దాటకపోవటం చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయాయి. ఆ విషయంలో దిల్లీ నిర్ణయం అంతర్జాతీయంగా అనేక దేశాల అభిప్రాయాన్ని భారత్‌కు సానుకూలంగా మార్చింది.


దౌత్య పరంగా


దాయాది దేశం సిమ్లా ఒప్పందాన్ని తుంగలోకి తొక్కిందని భారత్‌ ప్రపంచదేశాలకు స్పష్టంగా తెలియజేసింది. చొరబాట్లకు పాల్పడింది ఉగ్రవాదులు కాదు.. ఆ ముసుగులో వచ్చింది.. పాకిస్థాన్‌ సైన్యమే అని ఆధారాలు చూపించింది. అన్నింటికి మించి.. అణుపరీక్షలతో ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలోనూ... అంతపెద్ద యుద్ధంలో ఎక్కడా అణు కవ్వింపులు లేకుండా.. మన సంయమనం స్థాయి నిరూపించుకున్నామని.. " ఇండియాస్‌ మిలటరీ కాన్‌ఫ్లిక్ట్స్‌ అండ్ డిప్లమసీ" అనే పుస్తకంలో ఈ వివరాలన్నీ సమగ్రంగా పేర్కొన్నారు నాటి సైన్యాధిపతి జనరల్‌ వీపీ మాలిక్.


దిల్లీ చూపించిన సాక్ష్యాధారాలతో పాక్‌ సంప్రదాయ మద్దతుదారు ఓఐసీ(ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్).. కూడా భారత్‌కు వ్యతిరేకంగా నిలిచేందుకు ఇష్టపడలేదు. ఈ పరిణామాలతో భారత్‌ రణక్షేత్రంలోనే కాక వ్యూహాత్మక విధానాల్లోనూ పాక్‌పై పైచేయి సాధించింది. పాక్‌ ప్రధానిపై తీవ్ర ఒత్తిడి పడింది.


దీంతో పాక్‌ సైన్యంలో నిస్సత్తువ అలుముకుంది. చివరకు పాక్ ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఫలితంగా అంతర్జాతీయ సమాజం ముందు ఆ దేశం దోషిగా నిలబడింది. ఉగ్రదేశంగా ముద్ర వేయించుకుంది. దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బతింది.


Also Read: Rahul Gandhi Detained: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్


Also Read: Gujarat Hooch Tragedy: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి- 40 మంది పరిస్థితి విషమం!