DY Chandrachud: న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శుక్రవారం అన్నారు. హైకోర్టులు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి నిర్ధిష్ట ప్రమాణాలను నిర్దేశిస్తామని డీవై చంద్రచూడ్ తెలిపారు. నియామకాలకు అర్హులైన అత్యున్నత న్యాయమూర్తులను అంచనా వేయడానికి ప్రణాళిక మరియు పరిశోధన కేంద్రం విస్తృతంగా పని చేస్తోందన్నారు. న్యాయమూర్తులపై అందుబాటులో ఉన్న డేటా, వారు వెలువరించే తీర్పుల ఆధారంగా మదింపు జరుగుతుందని ఆయన తెలిపారు. 


హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో నియామకాల కోసం ఆబ్జెక్టివ్ ప్రమాణాలతో ఒక పత్రాన్ని తయారుచేస్తామని, దేశంలోని టాప్ 50 మంది న్యాయమూర్తులను ఉన్నత న్యాయస్థానాల్లో నియమించడానికి చర్యలు తీసుకోనున్నట్లు డీవై చంద్రచూడ్ తెలిపారు. న్యాయమూర్తులను  సుప్రీం కోర్ట్ కొలీజియం జడ్జిలు నియమించే ప్రక్రియను విమర్శలను ఎదుర్కొంటోందని, మూడు దశాబ్దాల నాటి కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా, జవాబుదారీగా లేదని విమర్శించారు. 


సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల వ్యవస్థ, అస్తవ్యస్తంగా, అసమర్థంగా ఉందని మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రయాపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ కాదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గతంలో అన్నారు. ప్రస్తుత వ్యవస్థ నడుస్తున్న మార్గంలో పని చేయడమే కొలీజియం వ్యవస్థకు పరిష్కారమని ఆయన అన్నారు.


కొలీజియం వ్యవస్థే భేష్ అన్న జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌
హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్రానికి, సుప్రీంకోర్టు మధ్య విభేదాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గత మార్చి నెలలో స్పందించారు. ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పనితీరు బేష్షుగ్గా ఉందన్నారు. ‘వ్యవస్థల్లో ఏదీ పరిపూర్ణం కాదు. కానీ అందుబాటులో ఉన్న కొలీజియం వ్యవస్థ ఉత్తమమైంది’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలంటే బయటి వ్యక్తుల ప్రభావం నుంచి జ్యుడీషియరీని కాపాడాల్సి ఉందన్నారు. 


‘ఏ వ్యవస్థ పరిపూర్ణం కాదు కానీ, మనం అభివృద్ధి చేసుకున్న వ్యవస్థ (కొలీజియం వ్యవస్థ) ఉత్తమమైంది. జ్యుడీషియరీ స్వతంత్రతను కాపాడాలి. ఇది ఎంతో ముఖ్యం. జ్యుడీషియరీ స్వతంత్రంగా ఉండాలనుకుంటే బయటి ప్రభావాల నుంచి జ్యుడీషియరీని కాపాడాలని మేం భావిస్తున్నాం’ అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు. రాజ్యాంగ న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసులను ఆమోదించకపోవడానికి కేంద్రం చెబుతున్న కారణాలను సుప్రీంకోర్టు బయటపెట్టింది. దీనిపై అప్పట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు.


 ‘ఒక అంశంపై భిన్నాభిప్రాయం ఉండటంలో తప్పేమిటి. ఇటువంటి భిన్నాభిప్రాయాలు రాజ్యాంగ రాజనీతిజ్ఞతను బలోపేతం చేస్తాయని భావిస్తున్నా. ఈ అంశాలపై కేంద్ర న్యాయశాఖ మంత్రితో చర్చలో పాల్గొనాలని నేను భావించడం లేదు’ అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ఇక వివిధ కేసులు ఎలా పరిష్కరించాలన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ‘జడ్జిగా 23 ఏండ్లుగా కొనసాగుతున్నా.. ఏ ఒక్క కేసు విషయంలోనైనా నేను ఎలా వ్యవహరించాలో ఏ ఒక్కరూ నాకు చెప్పలేదు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై ఇచ్చిన తీర్పు ఇందుకు రుజువు. జ్యుడీషియరీపై ఎటువంటి ఒత్తిడి లేదు’ అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు.