Joshimath Sinking:  ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. ఇక్కడ ఇళ్లు, రోడ్లు బీట్లు వారుతున్నాయి. దీనిపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఒక నివేదికను విడుదల చేసింది. 2022 డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 8 మధ్య ఈ నగరం 5.4 సెం.మీ. మేర క్షీణించిందని ఈ నివేదిక తెలిపింది. జనవరి 2న అక్కడ కొండ చరియలు విరిగి పడ్డాయని చెప్పింది. అయితే దీనిపై సంక్షోభం రోజురోజుకు పెరుగుతున్న వేళ ఈ నివేదికను ఇస్రో తన వెబ్ సైట్ నుంచి తొలగించింది.  


జోషిమఠ్ లోని పరిస్థితి తీవ్రతను ఈ నివేదిక సూచించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇక్కడి భూమి 5 సెం.మీ. కుంగినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు సంస్థ వెబ్ సైట్ లో ఈ నివేదిక కనిపించడంలేదు. అలాగే దీనికి సంబంధించిన పీడీఎఫ్ లింక్ పనిచేయడంలేదు. 


విరిగిపడిన కొండచరియలు


ఇస్రో నివేదిక ప్రకారం... ఏప్రిల్, నవంబర్ 2022 మధ్య 7 నెలల కాలంలో జోషిమఠ్ నగరం 9 సెంటీమీటర్ల వరకు భూమి క్షీణించింది. గత 12 రోజుల్లో ఇక్కడ కొండచరియలు విరిగిపడ్డాయని సమాచారం. ఇక్కడ నివసించడం సురక్షితం కాదని కొందరు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది.


జోషిమత్ చరిత్ర


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న జోషిమఠ్ కు పరమ పవిత్ర ప్రాంతంగా పేరుంది. ఈ నగరానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల వారు నెలకొల్పిన 4 పీఠాల్లో ఇదొకటి. 2021లో వచ్చిన ఉత్తరాఖండ్‌ వరదలతో  ఈ ప్రాంతం తీవ్రంగా ప్రభావితం అయ్యింది. 2013 వరదల్లో ఇక్కడ కంటోన్మెంట్‌ను బేస్‌ క్యాంప్‌గా సహాయక చర్యలకు ఉపయోగించారు. చమోలీ జిల్లాకు 6 వేల అడుగుల ఎత్తులో ఈ నగరం ఉంది. హై రిస్క్‌ జోన్‌(జోన్‌-5) పరిధిలో ఇది ఉంది.  భూగర్భంలో జలప్రవాహం నేపథ్యంలోనే ఇలా జరుగుతుందోనేమోనని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఒక అంచనా వేస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని చమోలీ జిల్లా  జాయింట్ మేజిస్ట్రేట్ దీపక్ సైనీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.