Jharkhand Students Protest:జార్ఖండ్ రాజధాని రాంచీ వీధులు విద్యార్థుల నినాదాలతో హోరెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నియామక పరీక్షల్లో, ముఖ్యంగా జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు అసెంబ్లీ మార్చ్‌కు పిలుపునిచ్చాయి. గడిచిన రెండు వాలుగా శాంతియుతంగా సాగుతున్న ఈ నిరసన నేడు ఉద్రిక్తంగా మారింది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాంచీలోని పాత అసెంబ్లీ గేటు వద్దు చేరుకోవడం ప్రారంభించారు. పాత అసెంబ్లీ నుంచి కొత్త అసెంబ్లీ భవనం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. తాము విద్యావంతులమని శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తామని విద్యార్థి నాయుకులు చెప్పారు. ఇందు కోసం వందల మంది వాలంటీర్లు కూడా పని చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ప్రభుత్వం ఒక కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది.
మరోవైపు శాంతియుత నిరసన అని విద్యార్థులు చెబుతున్నప్పటికీ అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కొత్త అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ 750 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ సెక్షన్ 163 విధించారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు. నలుగురు ఐపీఎస్ అధికారులు, పది మంది డీఎస్పీలు, 24 మంది ఇన్‌స్పెక్టర్లు, సుమారు 700 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. నిఘా కోసం డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలను వాడుతున్నారు. పాత అసెంబ్లీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథ మందిర్ చౌక్ వద్దే విద్యార్థులను నిలువరించారు. దీని కోసం భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అంబులెన్స్‌లోనే అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో
ఈ నిరసనలో అత్యంత చర్చనీయాంశమైనది విద్యార్థి నాయకుడు దేవంద్ర మహతో పోరాటం. గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహతో ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. అధికారులు కళ్లు గప్పి అంబులెన్స్‌లో అసెంబ్లీ వైపు కదిలిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంబులెన్స్‌లో ప్రయాణించిన ఆయన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తండ్రి జార్ఖండ్ ఉద్యమకారుడు దివంగత శిబు సోరెన్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని, తప్పుడు హామీలతో కాలాన్ని వెళ్లదీస్తోందని ఆయన ఆరోపించారు.
విద్యార్థుల డిమాండ్ ప్రకారం జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష రద్దు చేయాలి. ఈ పరీక్షా నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు వాదిస్తున్నారు.
అభయ్ తివారీ అనే వ్యక్తి తాను 400 మంది అభ్యర్థులను ఎంపిక చేయించానని బహిరంగంగానే అంగీకరించారని గుర్తు చేశారు. ఇంతటి బహిరంగంగా అక్రమాలు జరిగే ప్రభుత్వం మౌనంగా ఉండటం విద్యార్థుల ఆగ్రహానికి కారణం అవుతోంది.
విద్యార్థుల డిమాండ్‌లలో 98 శాతం నెరవేర్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మిగిలిన 2 శాతం చాలా కీలకమని అంటున్నారు. ఆ రెండు శాతంలోనే సీబీఐ విచారణ, పరీక్ష రద్దు వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. అందుకే ఒక్క శాతం కూడా రాజీ పడటం లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే ఈ ఉద్యమం పిల్లల భవిష్యత్‌కు సంబంధించిందని పార్టీలకు సంబంధం లేదని చెబుతున్నారు.
