Cloudburst Near Amarnath Shrine :  భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ పవిత్ర క్షేత్రానికి సమీపంలో శుక్రవారం సాయంత్రం వరద బీభత్సం సృష్టించింది. ఈ విషాదంలో 15 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 35 నుంచి 40 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. సహాయక చర్యలు శనివారం ఉదయం సైతం కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 15000 మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రెస్క్యూ టీమ్ తెలిపింది. అవసరమైన చోట హెలికాప్టర్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ముందుగా లోతట్టు ప్రాంతాల వారిని తరలిస్తున్నట్లు ఐటీబీపీ అధికారులు తెలిపారు.






వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు బుధవారం తిరిగి ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలో మరోసారి వరద బీభత్సం చేసి అపార ప్రాణ నష్టం కలిగించింది. ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహయ చర్యలు కొనసాగిస్తున్నాయి. వరద నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు యాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు వెల్లడించారు.


రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
అమర్‌నాథ్ క్షేత్రానికి సమీపంలో ఆకస్మిక వరదలతో విషాదం నెలకొనడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని, ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.






యాత్రికుల టెంట్లు ధ్వంసం..
శుక్రవారం సాయంత్రం అమర్‌నాథ్ క్షేత్రానికి సమీపంలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద వచ్చింది. వరద నీటి ప్రవాహ ఉద్ధృతికి సమీపంలోని బేస్ క్యాంప్ దెబ్బతింది. యాత్రికులకు ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన టెంట్లు దాదాపు 25 వరకు ధ్వంసమయ్యాయి. కొన్ని వంటశాలలు కూడా వరద ప్రవాహానికి ధ్వంసం కావడంతో ఇండియన్ ఆర్మీ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మొదటగా లోటత్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.