Cloudburst in Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఏడుగురు మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. శనివారం నుంచి ఆదివారం రాత్రి వరకు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. అధికారుల వివరాల ప్రకారం.. కథువాలోని రాజ్‌బాగ్ ప్రాంతంలోని జోడ్ ఘాటిని క్లౌడ్ బరస్ట్ ముంచెత్తింది. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మారుమూల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ఇండ్లు నేతమట్టమం అయ్యాయి. భారీగా ఆస్తికి నష్టం జరిగింది.
సహాయక చర్యలు చేపట్టిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాల నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఆరుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ప్రవాహ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
స్పందించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కథువాక్లౌడ్బరస్ట్ తర్వాత కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కథువా ఎస్ఎస్పీతో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నామని X వేదికగా పోస్ట్ చేశారు. క్లౌడ్‌బరస్ట్ రైల్వే ట్రాక్, జాతీయ రహదారి కథువా పోలీస్ స్టేషన్‌ను దెబ్బతీసిందని కేంద్ర మంత్రి తెలిపారు. ‘జాంగ్లోట్ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ సంభవించినట్లు సమాచారం అందుకున్న తర్వాత కథువా SSP శోభిత్ సక్సేనాతో మాట్లాడాను. నలుగురు చనిపోవడం దురదృష్టకరం. రైల్వే ట్రాక్, జాతీయ రహదారి దెబ్బతిన్నాయి. కథువా పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది. స్థానిక అధికారులు సైనికులు, పారామిలిటరీ దళాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
సంతాపం వ్యక్తం చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లాకథువా వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయ చర్యలు అందించాలి అధికారులను ఆదేశించారు. ‘జోధ్ ఖాద్ మరియు జుతానాతో సహా కథువాలోని అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయి, అనేక మంది గాయపడిన ఘటనలపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అవసరమైన అన్ని సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు" అని ముఖ్యమంత్రి కార్యాలయం Xలో తెలిపింది.
హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశాంలెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం విచారం వ్యక్తం చేశారు. రక్షణ మరియు సహాయ కార్యకలాపాల గురించి హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు పేర్కొన్నారు. ‘వినాశకరమైన వర్షాల కారణంగా కథువాలోని అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణనష్టం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం మనసును కలచివేస్తోంది. ‘సైన్యం, NDRF, SDRF, పోలీసులు, పరిపాలన విభాగం చేపట్టిన రక్షణ, సహాయ చర్యల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించాను’ అని ఆయన Xలో పోస్ట్ చేశారు.
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులుకతువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలు, లఖన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిల్వాన్, హుట్లీలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. కానీ పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో నీటి వనరుల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ఉజ్ నది ఇప్పటికే ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది.
కొద్దిరోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోని ఛాషోటీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. మచైల్ మాత యాత్రకు వెళ్లే బాటసారులు ఈ వరదల్లో చిక్కుకున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడి మొత్తం 46 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.