India Journey from 1947 to 2025 | న్యూఢిల్లీ: 1947 నుంచి స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారతదేశ ప్రధాన మంత్రులు ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తూనే, మన ప్రాధాన్యతలను నిర్దేశిస్తూ, భవిష్యత్తుపై ఫోకస్ చేసే విషయాలు పేర్కొంటారు. ఈ ఇండిపెండెన్స్ డే (Independence Day) ప్రసంగాలను సమీక్షించడం ద్వారా ప్రతి నాయకుడు పాలన, విదేశీ దౌత్య సంబంధాలు నుంచి ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత వరకు పలు సమస్యలను ఎలా పరిష్కరించారో అర్థం చేసుకోవచ్చు.
దశాబ్దాలుగా దేశ విధానాల్లో మార్పులు
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగాలు ఎక్కువగా పేదరికం, వ్యవసాయం, విద్య, విదేశాంగ విధానంపై ఉండేవి. దేశం ముందు చాలా పెద్ద సవాళ్లున్నప్పటికీ నెహ్రూ ఆగస్టు 15న 15 నిమిషాల పాటు మాత్రమే ప్రసంగించారు. ఆయన కుమార్తె, ఇండియన్ ఐరన్ లేడీగా పేరుగాంచిన ఇందిరా గాంధీ ప్రసంగాలు ఎక్కువసేపు ఉండేవి. తరువాతి నాయకులతో పోలిస్తే ఆమె ప్రసంగాలు స్వల్ప వ్యవధిగా మారాయి. రాజీవ్ గాంధీ ఇండిపెండెన్స్ డే ప్రసంగాలను పెంచారు. దాదాపు అరగంటకు పైగా మాట్లాడేవారు.
గత 12 ఏళ్లుగా భాతర ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారు. వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలు, ఎవరి హయాంలో ఏం జరిగింది, తరువాత వచ్చిన మార్పులపై పురోగతి నివేదికలను అందిస్తున్నారు. మోదీ శైలి గత ప్రధాన మంత్రులకు భిన్నంగా ఉంది.
వ్యాపారం, ఆర్థిక వ్యవస్థపై ఫోకస్
స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో ప్రభుత్వం, వ్యాపారం మధ్య సంబంధం ఒక రిపీటెడ్ అంశంగా ఉండేది. నెహ్రూ తరచుగా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలపై విమర్శనాత్మక అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. వారు లాభాపేక్ష, బ్లాక్ మార్కెట్ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరా గాంధీ సైతం అవినీతి, మార్కెట్ మానిప్యులేషన్లకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ ఆందోళనలను వ్యక్తం చేసేవారు. రాజీవ్ గాంధీ తన తల్లి హయాంలో బ్యాంకుల జాతీయీకరణ వంటి సంస్కరణలను హైలైట్ చేసేవారు. అదే సమయంలో పెట్టుబడిదారీ శక్తుల ప్రభావాన్ని పరిమితం చేయాలని ప్రసంగంలో ప్రస్తావించేవారు.
అయితే, ప్రధాని మోదీ ఇందుకు భిన్నమైన శైలిని అనుసరిస్తున్నారు. 2019 ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో, ఆయన సంపద సృష్టికర్తలను "దేశ నిర్మాతలు" అన్నారు. పరిశ్రమలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించాలని కోరారు. ఇది స్టార్టప్‌లు, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే మార్పును ప్రతిబింబిస్తుంది.
పౌరులకు సూచనలు
దేశ ప్రధానులు పౌరులపై అవలంబించిన ధోరణి మారింది. నెహ్రూ తరచుగా ప్రజలను మరింత కష్టపడి పనిచేయాలని, వృధాను నివారించాలని పిలుపునిచ్చేవారు. కొన్నిసార్లు కొరత, ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా ప్రజలు మెలగాలని సూచించేవారు. ఇందిరా గాంధీ సైతం దేశ నిర్మాణంలో పౌర బాధ్యతను నొక్కిచెప్పేవారు. బ్లాక్ మార్కెట్ విధానాలను ప్రోత్సహించే వినియోగదారుల ఎంపికను తప్పుపట్టేవారు. రాజీవ్ గాంధీ భారతదేశ పురోగతిని దశాబ్దాల నాయకత్వ ఫలితంగా జరిగిందని అభివర్ణించారు. వీరికి భిన్నంగా పౌరులపై నమ్మకం ఉంచారు ప్రధాని మోదీ. పౌరుల స్థితిస్థాపకతే జాతీయ పరివర్తనకు కేంద్రంగా పేర్కొన్నారు.
జాతీయ భద్రత, భారత విదేశాంగ విధానం
చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే బయటి ముప్పులకు ప్రతిస్పందన చర్చకు వచ్చేది. తొలి ప్రధాని నెహ్రూ 1962, 1963 ప్రసంగాలలో చైనాతో సరిహద్దు వివాదం ప్రస్తావన తరువాత జాగ్రత్తగా వ్యవహరించాయి. కానీ సైనికుల త్యాగాల ప్రస్తావన లేకపోవడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రధాని మోదీ 2020లో లడఖ్‌లో భారత్ ప్రతిస్పందన వంటి సైనిక విజయాలను హైలైట్ చేశారు. వీలుచిక్కినప్పుడల్లా వీర జవాన్లకు నివాళులర్పించేవారు.
పాకిస్తాన్ విషయంలో, నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఉన్న ప్రధాన మంత్రులు తరచుగా ఉమ్మడి చరిత్ర, శాంతి ఆవశ్యకత గురించి మాట్లాడారు. కానీ మోదీ విధానం దృఢంగా ఉంది. ఉగ్రవాదంపై చర్య తీసుకోవడంతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు.
ద్రవ్యోల్బణం సమయంలో పాలనా సవాళ్లు
ద్రవ్యోల్బణం, ఆహార కొరత దేశంలో స్థిరమైన ఆందోళనగా ఉన్నాయి. నెహ్రూ, ఇందిరా గాంధీ తమ ప్రసంగంలో తరచుగా ఈ సమస్యను ప్రస్తావించారు. ఇందిరా గాంధీ ఒకానొక సమయంలో కొరతను తగ్గించడానికి ఇంట్లో కూరగాయలు పెంచాలని ప్రజలకు సూచించారు. మన్మోహన్ సింగ్ రైతుల కోసం మంచి ధరలు కావాలన్నారు. కాని ద్రవ్యోల్బణానికి పాక్షికంగా ప్రపంచ కారణాలను చూపారు. ప్రధాని మోదీ కరోనా మహమ్మారి సమయంలో ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. బలమైన స్థూల ఆర్థిక మూలాలపై మోదీ సర్కార్ దృష్టి సారించింది.
పాలనలో జవాబుదారీతనంపై, నెహ్రూ, ఇందిరా బాధ్యత గురించి మాట్లాడారు. కానీ భారాన్ని పౌరులపైకి నెట్టి విమర్శలు ఎదుర్కొన్నారు. 2014లో తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ.. ప్రభుత్వాలు "మాట మీద నిలబడాలి" అని.. ప్రభుత్వ పారదర్శకత, అమలు చేయడంపై ఒత్తిడి తెచ్చారు.
ప్రజాస్వామ్యం, నాయకుల భిన్నశైలి
1970ల మధ్యకాలంలో అత్యవసర పరిస్థితి (Emergency In India) సమయంలో ఇందిరా గాంధీ పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛను నిలిపివేయడాన్ని ప్రస్తావించారు. ఆ తరువాత రాజీవ్ గాంధీ ప్రజాస్వామ్య సంస్థలకు మద్దతిచ్చారు. కాని వాటిలో బాధ్యతారాహిత్యాన్ని రాజీవ్ విమర్శించారు. ఇందుకు విరుద్ధంగా మోదీ పదేపదే ప్రజాస్వామ్యమే భారతదేశ బలం అని అభివర్ణించారు. పాలనలో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు ముగింపు పలకాలన్నారు.
వారసత్వ రాజకీయాలు కొనసాగింపు
గత ప్రధాన మంత్రులు తమ పూర్వీకులను అనుసరించారు. రాజీవ్ గాంధీ భారతదేశ పురోగతికి ప్రధానంగా తన కుటుంబ నాయకత్వమే కారణమని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా ప్రధాని మోదీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు అన్ని ప్రభుత్వాలు చేసిన మంచి పనులను ప్రస్తావించారు. తొలి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని బలోపేతం చేశారని తాజా ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొనడమే అందుకు నిదర్శనం.