Jagannath Rath Yatra: ఘనంగా ప్రారంభమైన జగన్నాథ్ రథయాత్ర, ఢిల్లీలోని మందిర్‌లో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు
Jagannath Rath Yatra: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రసిద్ధ గ్రామమైన హౌజ్ ఖాస్ లోని జగన్నాథ్ మందిర్ లో రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు.
Jagannath Rath Yatra: దేశ వ్యాప్తంగా జగన్నాథ యాత్ర ప్రారంభమైంది. పూరీ, అహ్మదాబాద్ లలోని ప్రతిష్టాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుడి రథం బయల‌్దేరింది. ఒడిశాలోని పూరీలో, గుజరాత్ లోని ఆహ్మదాబాద్ లోగల జగన్నాథ స్వామి ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఈ పవిత్ర యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయాలన్నీ ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్ర జరుపుకుంటారు. పూరీలో జరిగే రథయాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కాగా హిందూ సనాతన ధర్మం ప్రకారం జగన్నాథుడు అంటే విశ్వం అంతటికీ నాథుడు లేదా ప్రపంచానికి ప్రభువు అని అర్థం. పూరీ నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. ఈ ఒక్క యాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్ఖయాత్రలు చేసిన పలాలు లభిస్తాయని విశ్వాసం.
దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ హౌజ్ ఖాస్ లో జగన్నాథ్ మందిర్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. త్రివిధ దళాలకు చెందిన సెక్యూరిటీ అధికారులు ఇతర సిబ్బందితో కలసి ఇవాళ ఉదయం ఆరు గంటలకే ఆమె జగన్నాథ్ మందిర్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛారణలతో భగవంతుడిని స్తుతించారు. అనంతరం రాష్ట్రపతి భగవంతుడికి మొక్కుకొని ఆశీర్వాదం తీసుకున్నారు.
జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు. బంగాళాఖాతం తీరానగల పూరీ బీచ్‌లో పూరీ జగన్నాథ రథయాత్రను ప్రతిబింబించేలా సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పం రూపకల్పనలో రకరకాల రంగులను పట్నాయక్ వినియోగించారు. అదే విధంగా సుదర్శన్ పట్నాయక్.. ఈ సైకత శిల్పం కోసం 250 కొబ్బరి కాయలను ఉపయోగించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial