భారత్ తరపున విదేశాల్లో దౌత్యవేత్తలుగా ఉంటున్న ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులు ఇప్పుడు పూర్తిగా మారిపోయారని .. తాము విధులు నిర్వహిస్తున్న దేశాలతో సత్సంబంధాలు నిర్వహించుకోవడం కాకుండా తగవులు పెట్టుకుంటున్నారని.. అహంకారంతో వ్యవహరిస్తున్నారని లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ కౌంటర్ ఇచ్చారు. జైశంకర్ గతంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో సుదీర్ఘమైన సేవలు అందించారు. 


లండన్‌లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొన్న సమయంలో  యూరప్‌లోని కొంత మంది బ్యూరోక్రాట్స్‌తో తాను మాట్లాడానని.. వారంతా ఇండియన్ ఫారిన్ సర్వీస్ పూర్తిగా మారిపోయిందని అన్నారని రాహుల్ తెలిపారు. వారు ప్రస్తుతం ఏమీ వినడం లేదన్నారు. తాము చెప్పిందే వినాలని అహంకారంతో చెబుతున్నారు కానీ ఎదుటివారి మాటలను ఆలకించడం లేదని యూరప్ అధికారులు చెప్పారని రాహుల్ సదస్సులో వ్యాఖ్యానించారు. అలా చేయకూడదని రాహుల్ వ్యాఖ్యానించారు. 


రాహుల్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ స్పందించారు. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నిజంగానే ఇండియన్ ఫారిన్ సర్వీస్ మారిపోయిందన్నారు. వారు భారత ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇతరు వాదనలకు కౌంటర్ కూడా ఇస్తున్నారన్నారు. అయితే ఇది అహంకారం కాదని ఆత్మవిశ్వాసంగా పిలుస్తారని కౌంటర్ ఇచ్చారు. 






ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటినీ బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.  బీజేపీ దేశమంతటా కిరోసిన్ ఆయిల్  జల్లిందని దీనికి ఓ నిప్పు రవ్వ చాలునని రాహుల్ వ్యాఖ్యానించారు.  రాష్ట్రాల అధికారాలను తగ్గించేందుకు ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)లను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా వాడుకుంటోందన్నారు. ఓ భావజాలం భారత దేశ గళాన్ని అణగదొక్కిందన్నారు. ఇప్పుడు జాతీయ భావజాల పోరాటం జరుగుతోందని చెప్పారు. భారత దేశంలో మీడియా న్యాయంగా లేదని, ఓ పక్షం వైపు ఉంటూ ఏకపక్షంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. లడఖ్‌ (Ladakh)లో ప్రస్తుతం ఉక్రెయిన్ (Ukraine) తరహా పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలన్నింటిపై బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.