Railways Ticketing System | దసరా, దీపావళి పండుగల సీజన్లలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భారీ రద్దీ ఏర్పడుతుంది. ముఖ్యంగా రిజర్వ్ చేయని టికెట్ కౌంటర్ల వద్ద ప్రజలు చాలాసేపు క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇకపై టికెట్ కోసం కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు, టికెట్ మీ వద్దకే వస్తుంది. ఉత్తర రైల్వే లక్నో డివిజన్ కొత్త పథకం ప్రకారం, ఇప్పుడు రైల్వే సిబ్బంది స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో తిరుగుతూ టిక్కెట్లు విక్రయిస్తారు. వీధి వ్యాపారులు వస్తువులను అమ్మినట్లుగానే ఈ కొత్త రైల్వే టికెట్ వ్యవస్థకు ఎం-యుటిఎస్ అని పేరు పెట్టారు. దక్షిణాదిన సైతం త్వరలో ఇలాంటి విధానాన్ని తెచ్చే అవకాశం ఉంది. పండుగల సమయంలో రద్దీని నియంత్రించడానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి ఈ వ్యవస్థను ప్రారంభించారు. రైల్వే కొత్త టికెటింగ్ సిస్టమ్ ఏంటో తెలుసుకుందాం.
రైల్వే కొత్త టికెటింగ్ సిస్టమ్ ఏంటి?
రైల్వే కొత్త టికెటింగ్ సిస్టమ్ ఎం-యుటిఎస్ (M UTS) అనేది మొబైల్ టికెటింగ్ మేషిన్. ఇది రోడ్డు రవాణాలో భాగంగా బస్సుల్లో టికెట్లు ఇచ్చే మేషిన్ తరహాలో ఉంటుంది. ఈ యంత్రం తేలికగా ఉంటుంది, దీనికి వైర్లు ఉండవు. రైల్వే సిబ్బంది దీన్ని తీసుకుని ప్లాట్‌ఫారమ్‌లో తిరగవచ్చు. అక్కడే నిలబడి ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు టిక్కెట్లు జారీ చేయవచ్చు. ప్రయాణికులు ఈ ఎం యూటీఎస్ నుండి టిక్కెట్లు పొందవచ్చు. తక్షణమే ప్రయాణించాలనుకునే వారు కౌంటర్ల రద్దీని నివారించాలనుకునే వారికి ఇది చాలా ప్రయోజనం చేకూర్చనుంది.
ఎక్కడెక్కడ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది?
మొదటి దశలో నాలుగు ప్రధాన స్టేషన్లలో రైల్వే ఎం-యుటిఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో చార్‌బాగ్ రైల్వే స్టేషన్, అయోధ్య రైల్వే స్టేషన్ (Ayodhya Railway station), వారణాసి రైల్వే స్టేషన్, ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్ ఉన్నాయి. ఈ స్టేషన్లలో రైల్వే సిబ్బంది ప్లాట్‌ఫారమ్‌లలో తిరుగుతూ ప్రయాణికులకు టిక్కెట్లు జారీ చేస్తారు. దీని కోసం చార్‌బాగ్, అయోధ్యతో పాటు వారణాసిలలో 10 చొప్పున ఎం-యుటిఎస్ యంత్రాలు అందుబాటులో ఉంచుతారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో 5 యంత్రాలు జారీ చేశారు. అంటే మొత్తం 35 యంత్రాలతో ఎం యూటీఎస్ రైల్వే టికెటింగ్ సిస్టమ్ ప్రారంభమవుతుంది.
ఈ విధంగా టికెట్ తీసుకోవడానికి యూనిఫాం ధరించిన రైల్వే సిబ్బంది రైల్వే స్టేషన్లలో ఉంటారు. వారి చేతిలో ఎం-యుటిఎస్ మేషిన్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పి నగదు చెల్లిస్తే వారు MUTS మేషిన్ నుంచి టికెట్‌ను ప్రింట్ చేసి ఇస్తారు. అలాగే చెల్లింపు కోసం నగదు, UPI ఆప్షన్ సైతం ఉంటుంది. ఇక్కడ తరువాత త్వరలోనే మరికొన్ని రైల్వే డివిజన్లు, జంక్షన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.