Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగం (Silkyara Tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులు మంగళవారం రాత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆయా కార్మికుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నిండాయి. దాదాపు 17 రోజుల తరువాత బయట ప్రపంచాన్ని చూసిన తరువాత హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) మండి ప్రాంతానికి చెందిన విశాల్ (Vishal) అనే కార్మికుడు తమకు జరిగిన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
సొరంగంలో చిక్కుకున్న తొలి ఐదు నుంచి ఆరు రోజులు కష్టంగా గడిచిందని వివరించాడు. సొరంగంలో చిక్కుకోవడం చేదు అనుభవమని, కొద్ది రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపామని చెప్పారు. తరువాత పరిస్థితులను అర్థం చేసుకున్నామని, మనోబలంతో కార్మికులంతా ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తమకు అధికారులు అన్ని విధాలుగా అండగా నిలిచారని, తమకు అవసరమైన ఆహారం, నీరు, వసతులు కాల్పించారని, వారికి ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. తరచుగా అధికారులతో మాట్లాడం కార్మికులకు ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. అధికారులు చేస్తున్న ప్రయత్నాలను చెబుతున్నప్పుడు బయటకు వస్తామనే నమ్మకం కలిగిందని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.
విశాల్‌తో పాటు 40 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకోవడంతో నవంబర్ 12న దీపావళి పండుగ జరుపుకోలేదు. మంగళవారం కార్మికులు అంతా సురక్షితంగా బయటపడడంతో విశాల్ కుటుంబం సంబరాలు చేసుకుంది. కుటుంబం అంతా మంగళవారం రాత్రి పటాసులు పేలుస్తూ దీపావళి జరుపుకుంది. ఈ సందర్భంగా విశాల్ తల్లి ఊర్మిళ, కుటుంబం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
17 రోజుల తరువాత బయటకు..
దాదాపు 17 రోజుల శ్రమ, కృషి ఫలించింది. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగం (Silkyara Tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను అధికారులు మంగళవారం సురక్షితంగా కాపాడారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation)లో కార్మికులను రక్షించేందుకు చేసిన పలు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయినా అలుపెరుగని ప్రయత్నం చేసిన ప్రభుత్వం మంగళవారం వారిని బయటకు తీసుకొచ్చింది. రాట్ హోల్ మైనింగ్ నిపుణులు రాత్రి 7 గంటలకు శిథిలాలను పూర్తిగా తొలగించడంతో కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు.
అధికారులను అభినందించిన ప్రధాని
విషయం తెలుసుకున్న ప్రధాని (Prime Ministeer) నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం అర్థరాత్రి కార్మికులకు ఫోన్ చేసి మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కార్మికులను సురక్షితంగా, విజయవంతంగా బయటకు తీసుకురావడానికి కృషి చేసిన రెస్క్యూ బృందాలను, వారు చేసిన ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు. మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం, ఐక్యత, జట్టు కృషికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని కొనియాడారు.
‘ఉత్తరకాశీలో కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. సొరంగంలో చిక్కుకున్న స్నేహితులకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని కలిగిస్తుంది. మీ అందరికి మంచి జరగాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మన స్నేహితులు వారి ప్రియమైన వారిని కలుసుకోవడం ఆనందం కలిగించే విషయం. ఈ కష్ట సమయంలో కార్మికుల కుటుంబాలు చూపించిన సహనం, ధైర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేమ. ఈ రెస్క్యూ ఆపరేషన్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి స్ఫూర్తికి నేను వందనం చేస్తున్నాను. వారి ధైర్యం, సంకల్పం కార్మిక సోదరులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం చూపారు. జట్టు కృషికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు’ అని అన్నారు.