దేశంలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ నోటిఫికేషన్ వెలువరించిన నేపథ్యంలో ఎక్కడ చూసిన పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలివ్వడం మనం చూశాం. కానీ, మధ్యప్రదేశ్ ఇండోర్ లోని చిరు వ్యాపారులు వినూత్నంగా ఓటర్లకు ఫ్రీ స్నాక్స్ ఇస్తామని ప్రకటించారు. అయితే, ఈ ఉచితం వెనుక ఓ సరైన కారణం కూడా ఉందండోయ్!. అదేంటంటే, ఓటింగ్ శాతం పెంచేందుకు తమ వంతుగా ఈ ఆఫర్ పెట్టినట్లు వ్యాపారులు తెలిపారు.
ఉదయం ఓటేసే వారికే
ఇండోర్ లోని '56 దుకాణ్' ప్రాంతంలో ఉన్న దుకాణ యజమానులు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ రోజున ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఫ్రీగా జిలేబీ, పోహా అందిస్తామని ప్రకటించారు. ఎవరైతే తొలుత ఓటేసి వేలికి ఇంకును చూపిస్తారో వారికి ఉచిత అల్పాహారం అందిస్తామన్నారు. అయితే, ఉదయం 9 గంటల వరకే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఓటింగ్ శాతం పెరిగేలా
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకే ఈ ఫ్రీ ఆఫర్ ప్రకటించినట్లు '56 దుకాణ్' ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుంజన్ శర్మ వెల్లడించారు. పరిశుభ్రత విషయంలో దేశంలోనే ఇండోర్ ముందుందని, ఓటింగ్ శాతంలోనూ అగ్రస్థానంలో ఉంచాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. ఓటింగ్ రోజు నిర్దేశిత సమయం దాటిన తర్వాత ఓటు వేసి వచ్చిన వారికీ 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని పేర్కొన్నారు. కాగా, ఇండోర్ అర్బన్ పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలుండగా, 2018లో 14.72 లక్షల ఓటర్లలో 67 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి 15.55 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు.
'56 దుకాణ్' ఏంటంటే.?
'56 దుకాణ్' అనేది ఇండోర్ లోని ఫేమస్ ఫుడ్ హబ్. ఇక్కడ అనేక ఆహార స్టాళ్లుండగా, నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పరిశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్ హబ్ గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) గుర్తించింది. ఇక్కడి అవుట్ లెట్స్ పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు తెలిపింది.
మధ్యప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్
230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 30న నామినేషన్ దాఖలుకు చివరి తేదీ కాగా, 31న నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్ 2 వరకూ అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవచ్చు. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు.