ఫేస్‌బుక్ స్నేహితుడు నుస్రుల్లా కోసం పాకిస్తాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజు అతడితో కలిసి అక్కడి పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తోంది. సోమవారం తెల్లవారుజామున నస్రుల్లా, అంజు విహారానికి వెళ్లారు. డిర్ ఎగువ జిల్లా, చిత్రాల్ జిల్లాలను కలిపే లావారీ సొరంగాన్ని వారు సందర్శించారు. అక్కడి అంజు, నస్రుల్లా పచ్చని తోటలో కూర్చుని చేతులు పట్టుకుని కనిపించారు. వీడియోలు తీసుకుంటూ, ఫొటోలు దిగుతూ సందడి చేశారు. తరువాత పాకిస్థాన్‌లో తాను సురక్షితంగా ఉన్నానని చెబుతున్నట్లు ఒక చిన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అందులో అంజూ మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడికి హఠాత్తుగా రాలేదు. చట్టప్రకారం ప్రణాళికతో వచ్చాను. మీ అందరికీ ఈ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. నా బంధువులను, పిల్లలను వేధించవద్దని మీడియా ప్రతినిధులను కోరుతున్నాను’ అని ఆమె అన్నారు. నస్రుల్లాతో కలిసి ఉండడంపై అంజు స్పందించింది. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని వెల్లడించింది. ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకున్న వార్తలు కూడా తప్పని కొట్టి పారేసింది. పాకిస్తాన్‌లో తలపై ఏదైనా వేసుకొని బయటకు వెళ్లాలి కాబట్టి బురఖా ధరించానని స్పష్టం చేసింది. తాను పాకిస్తాన్ చూసేందుకు అక్కడకు వెళ్లగా.. ఓ ప్రసిద్ధ వ్లాగర్ తమ ఫొటోలు, వీడియోలు తీయగా వైరల్ గా మారినట్లు తెలిపారు. నస్రుల్లాను తాను పెళ్లి చేసుకోవడం పూర్తిగా అవాస్తవం అని.. తాను త్వరలోనే ఇండియాకు తిరిగి రాబోతున్నానని పేర్కొన్నారు. అలాగే తాము కొన్ని డాక్యుమెంట్ల కోసం కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వెల్లడించారు.
అంజుతో పెళ్లిపై నస్రుల్లా సైతం స్పందించారు. తమకు పెళ్లి కాలేదని.. అసలీ తప్పుడు వార్తలన్నీ ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. తమకు ఆపద ఉన్నందున కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నాడు. అంజు విదేశీయురాలు కావడంతో ప్రభుత్వం తమకు 50 మంది పోలీసు అధికారుల భద్రతను కూడా కల్పించిందన్నారు. అంజు పాకిస్థాన్‌లో విదేశీయురాలని.. అందుకే ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిపారు. ఆమెపై ఎప్పుడైనా దాడి జరగవచ్చని.. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారని పేర్కొన్నారు. అందుకే ఆమెకు రక్షణ కల్పించాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. తమకు ఇంకా పెళ్లి కాలేదని.. వివాహ ధ్రువీకరణ పత్రంగా చూపిస్తున్న పేపర్ అంతా అబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అంజు తన ప్రాణ స్నేహితురాలు మాత్రమేనని, పాకిస్తాన్ చూడాలనే ఆశతో ఆమె టూరిస్ట్ వీసాపై ఇక్కడకు వచ్చారని అన్నారు. అంజు ఆగస్టు 20న అంజు భారత్‌కు తిరిగి వస్తుందన్నారు.
అంజు ప్రియుడి కోసం వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా చట్టబద్ధంగా పాకిస్తాన్‌కు వెళ్లింది. వీరికి 2019లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అంజూ విషయానికి వస్తే ఆమెకు రాజస్థాన్‌లో ఉంటున్న అరవింద్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. జైపూర్‌కు వెళ్లే సాకుతో గురువారం ఇంటి నుంచి అంజు వెళ్లిపోయిందని, ఆమె స్వదేశానికి తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.