India GDP Growth: భారతదేశ ఆర్థిక వృద్ధి మీద అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పాజిటివ్‌ ఔట్‌లుక్‌ను పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ గ్రోత్‌ రేట్‌ అంచనాను 20 బేసిస్ పాయింట్లు (0.2 శాతం) మెరుగు పరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ గ్రోత్‌ రేట్‌ 6.1 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో, FY24లో (2023-24) భారత వృద్ధి రేటు 5.9 శాతంగా ఉంటుందని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ అంచనా వేసింది. 


ఆర్థిక వృద్ధిని డ్రైవ్‌ చేయనున్న పెట్టుబడులు
అంతర్జాతీయ ద్రవ్య నిధి, తన అంచనాలను అప్‌డేట్‌ చేసి 'వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్' ‍(World Economic Outlook - WEO) రిపోర్ట్‌ను ఫ్రెష్‌గా రిలీజ్‌ చేసింది. భారత్‌లో దేశీయ పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఆర్థిక వృద్ధి రేటు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉండబోతోందని అవి సూచిస్తున్నాయని ఆ రిపోర్ట్‌లో వెల్లడించింది. 2022 నాలుగో త్రైమాసికం నుంచి ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ బలంగా పుంజుకున్నాయని, గ్రోత్‌ రేట్‌ను ఇవే ముందుకు డ్రైవ్‌ చేస్తాయని ఐఎంఎఫ్‌ చెప్పింది. 


2023-24 కాలంలో 6.1 శాతం జీడీపీ గ్రోత్‌ రేట్‌తో (GDP Growth Rate) గత అంచనాలను IMF పెంచినా, భారత ప్రభుత్వం & RBI ఫోర్‌కాస్ట్‌ కంటే ఇది తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం ఆర్థిక వృద్ధిని ఆర్‌బీఐ లెక్కగట్టింది.


భారతదేశ వృద్ధిలో 2022-23 నాలుగో త్రైమాసికం (ఈ ఏడాది జనవరి-మార్చి కాలం) అద్భుతంగా పని చేసింది. ఆ మూడు నెలల్లో GDP వృద్ధి రేటు 6.1 శాతంగా రికార్డ్‌ అయింది. దీని కారణంగా, మొత్తం 2022-23 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో భారతదేశ GDP గ్రోత్‌ రేట్‌ 7.2 శాతానికి చేరింది. ఆర్థికాభివృద్ధిలోని ఇదే వేగం 2023-24 మొదటి త్రైమాసికంలోనూ (2023 ఏప్రిల్‌-జూన్‌) కంటిన్యూ అయి ఉంటుందని అంచనా. జూన్‌ క్వార్టర్‌లో భారతదేశ జీడీపీ 8 శాతం వృద్ధి రేటును చూపగలదని రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా వేసింది.


FY24లో భారత వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచిన IMF, FY25 (2024-25) అంచనాను మాత్రం మార్చలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇండియా డీజీపీ గ్రోత్‌ రేట్‌ 6.3 శాతంగా ఉంటుందన్న గత అంచనాను అలాగే కంటిన్యూ చేసింది.


పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు
IMF రిలీజ్‌ చేసిన అప్‌డేటెడ్‌ 'వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్' రిపోర్ట్‌ ప్రకారం, 2022లో అంతర్జాతీయ వృద్ధి 3.5 శాతంగా నమోదైందని అంచనా. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు (global GDP growth rate) 3 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. గత ఏప్రిల్‌లో వేసిన అంచనా కంటే ఇది 20 బేసిస్‌ పాయింట్లు అధికం. 2024 సంవత్సరం ఫోర్‌కాస్ట్‌ను ఈ ఏజెన్సీ మార్చలేదు, 3 శాతం వృద్ధి రేటునే కొనసాగించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా "కష్టాల నుంచి బయటపడలేదు", ద్రవ్యోల్బణంపై చేస్తున్న ప్రపంచ యుద్ధం ముగియడానికి ఇంకా చాలా దూరం ఉందని IMF హెచ్చరించింది.


అమెరికా GDP గ్రోత్‌ రేట్‌ 2023లో 1.8 శాతంగా, 2024లో 1 శాతంగా ఉంటుందని IMF అంచనా వేయబడింది. యూరో ఏరియా ఆర్థిక వృద్ధి రేటు 2023లో 0.9 శాతంగా, 2024లో 1.5 శాతంగా ఉండొచ్చని లెక్కలు ప్రచురించింది. చైనా GDP వృద్ధి రేటు 2023లో 5.2 శాతంగా ఉంటుందని, 2024లో 4.5 శాతానికి తగ్గుతుందని చెబుతోంది.


మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Bajaj Finance, Tech Mahindra


Join Us on Telegram: https://t.me/abpdesamofficial