Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో ప్రయాణించే వారికి అలర్ట్! ఇన్నాళ్లు ఆ రైలులో కాంప్లిమెంటరీగా ఇస్తూ వస్తున్న ఒక లీటర్ వాటర్ బాటిల్ ను ఇకపై ఆపేయనున్నారు. ఒక లీటర్ వాటర్ బాటిల్ స్థానంలో అర లీటరు బాటిల్ ను మాత్రమే ఇవ్వనున్నట్లుగా భారతీయ రైల్వే ప్రకటించింది. ఇప్పటివరకూ రైల్ నీర్ బ్రాండ్ తో ఉన్న 1 లీటరు నీళ్ల సీసాను ఇవ్వగా.. దాన్ని 500 ఎంఎల్ వాటర్ బాటిల్ కు తగ్గించబోతున్నారు. తాగు నీటి వృథాను అరికట్టి, వనరులను సద్వినియోగం చేసుకొనే ఉద్దేశంతో ఈ మార్పు చేస్తున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. 


ఇకపై వందేభారత్ రైలు ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి 500 ఎంఎల్ రైల్ నీర్ బ్రాండ్ తో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్‌ను సిబ్బంది అందిస్తారని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు కావాలంటే మరో 500 ఎంఎల్ బాటిల్ ను సిబ్బందిని అడిగి ఉచితంగానే తీసుకోవచ్చని తెలిపారు. నార్తర్న్ రైల్వేకు చెందిన ముఖ్య ప్రజా సంబంధాల అధికారి దీపక్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. లీటరు బాటిల్స్ ప్రయాణికులకు ఇవ్వడం ద్వారా చాలా మంది సగం తాగేసిన బాటిల్స్ ను పడేస్తున్నారని తెలిపారు. అందుకే చిన్న వాటర్ బాటిల్స్ ప్రయాణికులకు ఇస్తే తాగునీరు వేస్ట్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.


ఇలాంటి నిర్ణయాన్నే శతాబ్ది రైళ్లలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లుగా సీపీఆర్వో వెల్లడించారు. ఎనిమిది గంటల్లోపు ప్రయాణం ఉండే రైళ్లలో అరలీటరు బాటిల్ నే ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. 


మరోవైపు, ఒక సెంట్రల్ రైల్వే పరిధిలోనే నీటి పొదుపు చర్యలు బాగా చేపడుతున్నారు. రీసైకిల్ చేసిన నీళ్లను కోచ్‌లు, ప్లాట్ ఫాంలు శుద్ధి చేయడానికి వాడుతున్నారు. అలా దాదాపు రోజుకి కోటి లీటర్ల నీటిని 32 రీసైక్లింగ్ ప్లాంట్ల ద్వారా పొదుపు చేస్తున్నారు. అంతేకాక, వర్షపు నీటిని ఒడిసిపట్టే విధాన్ని కూడా అవలంబిస్తున్నారు. 158 ప్రాంతాల్లో వీటిని అమర్చారు. ఇవి ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేస్తున్నాయి.