IRCTC Costly Tea : రైల్లో టీ ఎంతకు అమ్ముతారు ? రూ.పది . ఇది మాత్రమే మనకు తెలుసు. అయితే కొన్ని రైళ్లలో టీ ఖరీదు రూ. 20 వరకూ ఉంటుంది. ఆ రైల్లో టీ ఖర్చు రూ. 20 మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ. 70 వస్తుంది. చచ్చినట్లు కట్టాల్సిందే. అదేంటి టీ ఇరవై రూపాయలే కదా అంటే.. అవును అనే అంటారు. మరి డెభ్బై రూపాయలు ఎందుకు కట్టాలి అంటే మాత్రం బిల్లు చేతిలో పెడతారు. అందులో అసలు వివరాలు ఉంటాయి. యాభై రూపాయలు ఎందుకు ఎక్కువ అంటే సర్వీస్ చార్జ్ అన్నమాట. ఇది ఒకరిద్దరికి కాదు చాలా మందికి ఎదురవుతున్న అనుభవం అందుకే రెండు బిల్లుల్ని ఇద్దరు ప్రయాణికులు కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. ఈ బిల్లులు వైరల్ అయిపోయాయి.
ఇరవై రూపాయల టీకి యాభై రూపాయల సర్వీస్ చార్జీ మరీ అతిగా ఉందని ఎవరైనా గొణుక్కున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వారు వినిపించుకోరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత కూడా స్పందించలేదు. నిజానికి రైళ్లలోనే కాదు ఎక్కడైనా సర్వీస్ చార్జి అనేది కట్టే వాళ్ల ఇష్టం. హోటల్స్.. ఇతరులు ఎవరైనా సర్వీస్ చార్జి వేయవచ్చు. కానీ చెల్లించాలా వద్దా అనేది కస్టమర్ ఇష్టం. కానీ ఇక్కడ రైల్వేలో అదేమీ ఉండదు. చెల్లించి తీరాల్సిందే. ఎందుకంటే చాలా మందికి ఈ సర్వీస్ చార్జ్‌పై అవగాహన ఉండదు.
రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ప్రయాణించేవారు టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పుడే తమకు కావాల్సిన ఆహార పదార్ధాలను ఆర్డర్ పెట్టుకోవాలి. రైలు ఎక్కిన తర్వాత ఆర్డర్ పెట్టుకుంటే రూ. యాభై సర్వీస్ చార్జి వసూలు చేస్తారు. ఈ ప్రయాణికుడి విషయంలనూ అదే జరిగింది. అయితే రైల్వేల తీరుపై నెటిజన్లు ట్రోలింగ్‌తో వెటకారం చేస్తున్నారు. రైల్వేను ఓ ఆటాడుకుంటున్నారు.