Railway Ticket Booking: దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ మంది రైలు ప్రయాణానికి ఆసక్తి చూపిస్తుంటారు. సౌకర్యవంతంగా జర్నీ పూర్తి చేయడానికి చాలా మంది ముందుగానే ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటారు. అనుకోని ప్రాంతాలకు అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉండదు. ఇతర మార్గాలు ద్వారా ప్రయత్నించినా పెద్దగా సత్ఫలితం రాదు. కానీ, ట్రైన్‌ బయలుదేరడానికి ఐదు నిమిషాలు ముందు కూడా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. అయితే, దీని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. రైలు బయలుదేరడానికి కొద్ది నిమిషాలు ముందు టికెట్‌ ఎలా బుక్‌ చేసుకోవచ్చు..? అనే విషయాలను మీరు తెలుసుకోండి. 


కొన్ని రోజులు ముందు రైలు ప్రయాణం చేయాల్సి వస్తే సాధారణ పద్ధతిలో రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఒక వేళ ఒకటి, రెండు రోజులు ముందు ప్రయాణం ఖరారైతే తత్కాల్‌ బుకింగ్‌ విధానంలో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. కానీ, కొన్ని గంటలు ముందు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. దానికీ ఒక పద్ధతి ఉంది. టికెట్లు ఖాళీ ఉంటే రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాలు ముందు కూడా టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ముందుగా టికెట్లు బుక్‌ చేసుకునే ఎంతో మంది అనివార్య కారణాలతో కొన్నిసార్లు ప్రయాణాలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి వారి టికెట్లను కొన్ని క్షణాల ముందు కూడా బుక్‌ చేసుకోవచ్చు. ముందుగా పెట్టుకున్న షెడ్యూల్‌ ప్రకారం ప్రయాణం చేయలేని వాళ్లు.. ఆయా టికెట్లను రద్దు చేసుకుంటారు. ఈ రద్దు చేసుకున్న బెర్తులు ఖాళీగా ఉంటాయి. వీటిని విక్రయించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ట్రైన్‌ బుకింగ్‌ కన్ఫర్మేషన్‌ కోసం రైల్వేశాఖ రెండు ఛార్ట్‌లను సిద్ధం చేస్తుంది. ఫస్ట్‌ చార్ట్‌ రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు సిద్ధం అవుతుంది. రెండో చార్ట్‌ను రైలు స్టార్ట్‌ అవ్వడానికి ముందు రూపొందిస్తారు. గతంలో అర గంట ముందు వరకు మాత్రమే ఈ టికెట్లు బుకింగ్‌కు అనుమతించేవారు. ఇప్పుడు రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశాన్ని రైల్వేశాఖ అధికారులు కల్పిస్తున్నారు. 


ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు


ఈ టికెట్లును ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వెసులుబాటును రైల్వేశాఖ అధికారులు కల్పిస్తున్నారు. చివరి నిమిషం వరకు ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవడం కోసం ముందుగా అందులో సీట్లు ఖాళీ ఉన్నాయో..? లేదో..? తెలుసుకోవాలి. రైల్వేశాఖ ప్రిపేర్‌ చేసిన చార్ట్‌ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఐఆర్‌సీటీసీ యాప్‌ ఓపెన్‌ చేసి ట్రైన్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే.. చార్ట్‌ వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది. లేదా నేరుగా ఆన్‌లైన్‌ చార్ట్జ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ చార్ట్‌లో ట్రైన్‌ పేరు, నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలు ఎంటర్‌ చేసి గెట్‌ ట్రైన్‌ చార్ట్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే తరగతుల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి. సీటు ఉంటే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్లు లేకపోతే సున్నా చూపిస్తుంది. కోచ్‌ నెంబర్‌, బెర్త్‌.. మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్రైన్‌ ప్రారంభం అయ్యే స్టేషన్‌లో ఎక్కే వారికి మాత్రమే ఈ  ఆప్షన్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో ప్రయాణాలు సాగించాల్సి వచ్చిన ప్రయాణీకులు సులభంగా తమ గమ్యస్థానాలను సంతోషకరమైన ప్రయాణం పూర్తి చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధానంలో టికెట్లు పొందే ప్రయత్నం చేయండి.