కొద్ది కాలం క్రితం వరకూ నిరుద్యోగులు ఉద్యోగం కోసం విపరీతంగా వెతుకులాడేవాళ్లు. కానీ, ఇప్పుడు కేవలం ఉద్యోగమే కాదు.. ఇంటి నుంచి పని చేసే ఉద్యోగం కావాలట! నౌకరీ.కామ్ కి చెందిన నివేదిక ఒకటి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఉద్యోగాలు వెతుక్కొనే వేదిక అయిన నౌకరీ.కామ్‌‌లో ఏకంగా గత ఏడాది జులై నుంచి ఇప్పటిదాకా 93 వేల వరకూ పర్మినెంట్ లేదా శాశ్వత వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను వివిధ కంపెనీలు ఉంచాయి. ఈ 93 వేల పర్మినెంట్ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల్లో 22 శాతం పర్మినెంట్‌ జాబ్సే కావడం విశేషం.


దేశంలో గత 6 నెలల వ్యవధిలో ఒక్క నౌకరీ.కామ్‌లోనే వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కోసం నిరుద్యోగులు 32 లక్షల సెర్చ్‌లు చేశారు. ఇందులోనూ 57 శాతం సెర్చ్‌లు పర్మినెంట్ వర్క్ ఫ్రం హోం కోసం జరిగాయి. గతేడాది డిసెంబరులో అత్యధికంగా 3.5 లక్షల సెర్చ్‌లు వర్క్ ఫ్రంహోం కోసం జరిగాయి.


నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘రిక్రూటర్లు సిబ్బందిని నియమించుకోవడంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఈ అంకెలు తెలియజేస్తున్నాయి.  కరోనా వ్యాప్తి వల్ల ఒక అస్థిరత్వం ఏర్పడింది. దీంతో కార్పొరేట్ స్థాయిలో పెను మార్పులు జరుగుతున్నాయి. చాలా మంది రిక్రూటర్లు వర్క్ ఫ్రం హోం బెనిఫిట్స్‌ను గుర్తించి.. ఎక్కడి నుంచైనా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో మానవవనరులను సమకూర్చుకోవడంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నారు. పెద్ద, చిన్న స్థాయి కంపెనీలు ఏవైనా దాదాపు ఇవే మార్పులను ఆహ్వానించాయి. నౌకరీ.కామ్ తాజా నివేదిక ప్రకారం.. ఐటీ, సాఫ్ట్ వేర్, ఐటీ ఆదారిత రంగాల్లో చాలా కంపెనీలు శాశ్వత వర్క్ ఫ్రం హోం విధానం అవకాశాన్ని కల్పించాయి.’’ అని అన్నారు. 


ఇంకొన్ని దిగ్గజ కంపెనీలు తాత్కాలిక, శాశ్వత వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ జాబితాలో అమెజాన్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, పీడబ్ల్యూసీ, ట్రైజెంట్, ఫ్లిప్ కార్ట్, సీమెన్స్, డెలాయిట్, ఒరాకిల్, జెన్సర్, టీసీఎస్, క్యాప్ జెమినీ వంటివి ఉన్నాయి.


మరోవైపు, చాలా ఐటీ సంస్థలు వచ్చే ఏప్రిల్ నుంచి తమ ఉద్యోగులను ఆఫీసు రమ్మని సమాచారం అందించిన సంగతి తెలిసిందే. మూడో వేవ్ కూడా ముగిసిపోయినందున ఇక ఆఫీసులు తెరిచేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే అతి కొద్ది మందిని ఆఫీసులకు పిలిపించి పని చేయిస్తున్నారు. ఏప్రిల్ నుంచి విడతల వారీగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించనున్నారు.