Hit and Run Case News Updates: బ్రిటీషు కాలంలో తీసుకొచ్చిన చట్టాలను మన దేశంలో కొద్దిరోజుల కిందటి వరకు అమలులో ఉన్నాయి. ఇటీవల మూడు కొత్త న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలోని హిట్‌ అండ్‌ రన్‌ (Hit and Run Cases) కేసులకు సంబంధించి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ట్రక్క డ్రైవర్లు, ట్యాంకర్ల డ్రైవర్ల ( Truck Drivers Protest) అసోసియేషన్ ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి కీలక ప్రకటన చేసింది. హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించిన నిబంధనల్ని తాము ఇంకా అమలు చేయలేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా తెలిపారు.


దేశంలోని ప్రముఖ ట్రాన్స్‌ పోర్టు సంఘాలతో హిట్ అండ్ రన్ కేసు కొత్త నిబంధనలపై చర్చించిన తరువాతే ఆ చట్టంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏడు లక్షల జరిమానా, పదేళ్ల జరిమానా లాంటి కొత్త నిబంధనల్ని అమలు చేయకూడదంటూ దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. యూపీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, అసోసియేషన్ సమ్మె చేయడంతో నగరంలో నేటి మధ్యాహ్నం నుంచి పెట్రోల్ కొరత ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు ఇంధనం కోసం క్యూ కట్టారు. అయితే తాము ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ తో పూర్తిగా చర్చలు జరిపిన తరువాత హిట్ అండ్ రన్ కేసు కొత్త నిబంధనల్ని అమలు చేస్తామని అజయ్ భల్లా చెప్పారు. కనుక ట్రక్కు డ్రైవర్లు ప్రస్తుతం సమ్మె విరమించాలని కోరారు. అజయ్ భల్లా ప్రకటనతో ట్రక్కు డ్రైవర్లు సమ్మెను విరమించుకుంటున్నారు.