Bhairav Commandos News : సరిహద్దుల్లోకి చొరబడే వారిని మట్టుబెట్టడానికైనా లేదా సరిహద్దు అవతల ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికైనా, భారతదేశపు కొత్త భైరవ్ సైన్యం ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. భారత సైన్యంలో భైరవ్ కమాండోల కొత్త బెటాలియన్ ఏర్పడింది, ఇది శత్రువుతో పోరాడటానికి సిద్ధంగా ఉంది.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం (అక్టోబర్ 24, 2025)న పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న జైసల్మేర్లో మొదటి భైరవ్ బెటాలియన్ కమాండోలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం జైసల్మేర్లో మూడు రోజుల (అక్టోబర్ 23-25) ఆర్మీ కమాండర్ల సమావేశం జరుగుతోంది. రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఈ సైనిక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
చైనా-పాకిస్తాన్ సరిహద్దులో భైరవ బెటాలియన్ మోహరింపు
ఈ సందర్భంగా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న థార్ ఎడారిలో సైన్యం తన శక్తిని ప్రదర్శించింది. మొదటిసారిగా భైరవ్ బెటాలియన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. సమాచారం ప్రకారం, ఈ నెలాఖరు నాటికి ఐదు భైరవ్ బెటాలియన్లు సిద్ధమవుతాయి. ఈ బెటాలియన్లను చైనా, పాకిస్తాన్ సరిహద్దులు, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించారు.
భైరవ్ బెటాలియన్, ఇన్ఫాంట్రీ బెటాలియన్లు, స్పెషల్ ఫోర్సెస్ (పారా-ఎస్ఎఫ్) మధ్య వారధిగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా, సైన్యాన్ని మరింత పటిష్టంగా స్ట్రాంగ్‌గా మార్చే ఉద్దేశ్యంతో భైరవ్ బెటాలియన్లను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఒక బెటాలియన్లో దాదాపు 250 మంది కమాండోలు
సైన్యంలో మొత్తం 25 బెటాలియన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి బెటాలియన్లో దాదాపు 250 మంది కమాండోలు ఉంటారు. ఈ కమాండోలకు ప్రత్యేక శిక్షణతోపాటు ఆధునిక ఆయుధాలను కూడా అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ తరువాత, భైరవ్ బెటాలియన్లను ఏర్పాటు చేశారు, ఇది సైన్యం ఇన్ఫాంట్రీ బెటాలియన్లకు బలాన్ని చేకూరుస్తుంది.
ఈ భైరవ బెటాలియన్లు ఏర్పడిన తరువాత, పారా-ఎస్ఎఫ్ కమాండోలను ప్రత్యేక మిషన్ల కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం, జమ్మూ కాశ్మీర్ నుంచి ఈశాన్య ప్రాంతం వరకు ఉగ్రవాదులతో పోరాడటానికి, శత్రువుల వెనుక మిషన్ల కోసం పారా-ఎస్ఎఫ్ను ఉపయోగిస్తున్నారు. ఈ పారా-ఎస్ఎఫ్ కమాండోలు ఆకాశం నుంచి పారా-జంప్ చేయడంతో పాటు భారీ ఆయుధాలను కలిగి ఉంటారు.
ఆశ్చర్యకరమైన దాడుల కోసం మోహరించిన భైరవ బెటాలియన్
భైరవ్ కమాండోలను లీన్ అండ్ థిన్‌గా తయారు చేశారు, అంటే చిన్న ఆయుధాలతో నేలపై పోరాడటానికి సిద్ధం చేశారు. భైరవ్ బెటాలియన్‌ను శత్రువులపై ఆశ్చర్యకరమైన దాడులు చేయడానికి, సున్నితమైన సరిహద్దుల్లో గస్తీ నిర్వహించడానికి కూడా ఉపయోగిస్తారు. భారత సైన్యంలో ప్రస్తుతం 350 ఇన్ఫాంట్రీ బెటాలియన్లు ఉన్నాయి.
ప్రతి బెటాలియన్లో ఇప్పటికే ఒక పటిష్టమైన ప్లాటూన్ ఉంది, ఇందులో 15-20 మంది కమాండోలు ఉన్నారు, కాని భైరవ బెటాలియన్ ఈ కమాండోల కంటే మరింత ప్రమాదకరంగా ఉండబోతున్నారు. భైరవ్ బెటాలియన్ కమాండోలు ఇన్ఫాంట్రీతో పాటు సైన్యం ఫిరంగి దళం, సిగ్నల్, ఎయిర్ డిఫెన్స్ వంటి యూనిట్లలో కూడా చేరవచ్చు.