Indian Air Force Ensign: 


ఎయిర్‌ ఫోర్స్‌కి కొత్త చిహ్నం..


ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ ( Indian Air Force) చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్త చిహ్నాన్ని విడుదల చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న పరేడ్‌లో IAF చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ కొత్త చిహ్నాన్ని అధికారికంగా విడుదల చేశారు. 72 ఏళ్ల చరిత్రలో IAF చిహ్నం మారడం ఇదే తొలిసారి. బ్రిటీష్‌ కాలం నాటి గుర్తులన్నింటినీ చెరిపేస్తూ...వాటి ఆనవాళ్లు లేకుండా చూసుకుంటోంది భారత్. ఆ క్రమంలో ఇటీవల ఇండియన్ నేవీ చిహ్నాన్నీ మార్చేసింది. ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్‌ చిహ్నామూ (Indian Air Force New Ensign) మారిపోయింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ జెండాకి పైన కుడివైపున ఎయిర్‌ఫోర్స్ సింబల్ కనిపిస్తుంది. 1932 అక్టోబర్ 8వ తేదీన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ని స్థాపించారు. అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం నడుస్తోంది. ఆ సమయంలో IAF దీటుగా పోరాడింది. ఈ సామర్థ్యాన్ని చూసి 1945 మార్చిలో IAF పేరు ముందు "Royal" అనే పదాన్ని జోడించి గౌరవించారు. అప్పటి నుంచి Royal Indian Air Force (RIAF)గా పిలుచుకున్నారు. 1950 నాటికి భారత్‌ గణతంత్ర దేశంగా మారడం వల్ల Royal అనే పదాన్ని తొలగించి..ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా మార్చేశారు. 






ఇలా మారింది..


భారత్‌కి స్వాతంత్య్రం రాకముందు..అంటే RIAFగా ఉన్నప్పుడు జెండాపై ఎడమ వైపున Union Jack ఉండేది. రౌండెల్‌లో (roundel) రెడ్, వైట్, బ్లూ కలర్స్ ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరవాత యూనియన్ జాక్‌ని తొలగించారు. భారత త్రివర్ణ పతాకంతో పాటు రౌండెల్‌లోనూ జాతీయ జెండాలోని మూడు రంగులు జోడించారు. "ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ విలువలను మరింత గొప్పగా ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని విడుదల చేశాం" అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. కొత్త జెండాలో జాతీయ చిహ్నంతో పాటు అశోక చక్రం సింహం ఉన్నాయి. దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని రాసుంది. ఇందులో లేత నీలి రంగు రింగ్‌లో హిమాలయ్‌ ఈగల్ కనిపిస్తుంది. దాని కింద భారతీయు వాయుసేన అని రాసుంది. భగవద్గీతలోని చాప్టర్ 11 నుంచి "touching the sky with glory" అనే కోట్‌ని థీమ్‌గా తీసుకుంది.