న్యూఢిల్లీ: పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్ తగ్గేదే లే అంటోంది. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత త్రివిధ దళాలు మరోసారి తమ సత్తా చాటుతామని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమని వీడియోలు విడుదల చేస్తున్నారు. తాజాగా మంగళవారం ( మే 20న) భారత వైమానిక దళం (Indian Air Force) పవర్‌ఫుల్ వీడియో పోస్ట్ చేసింది.
'ఆరంభ్ హై ప్రచంద్ హై' అనే పియూష్ మిశ్రా రాసినపాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా.. ఇటు భారత వైమానిక దళం మరో పోరాటానికి సిద్ధంగా ఉందని తెలిపేలా చేస్తున్న విన్యాసాల వీడియో పోస్ట్ ఐఏఎఫ్ ఎక్స్ వేదిగా ఉదయం షేర్ చేసింది. ఇటీవల పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో జరిపిన దాడుల్లోనూ ఐఏఎఫ్ కీలక పాత్ర పోషించింది. దేశ భద్రతకు, సరిహద్దుల్లో రక్షణకు తామెప్పుడు కట్టుబడి ఉంటామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి.
"భారత వైమానిక దళం (Indian Air Force) ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో స్పందిస్తుంది. పీపుల్ ఫస్ట్ మిషన్ ఆల్‌వేస్. 'అన్‌సీన్, అన్‌స్టాపబుల్, 'స్విఫ్ట్, లెథల్, అజైల్' అని’ భారత వాయుసేన తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తామనేలా తమ సామర్థ్యాలను ప్రదర్శించింది. ధైర్యమే దిక్సూచిగా ఎయిర్ ఫోర్స్ అడుగులు వేస్తోందని, ప్రత్యర్థి ఆటలు కట్టిస్తుందనేలా’ వీడియో పోస్ట్ చేసింది. టచ్ ద స్కై విత్ గ్లోరీ అనే క్యాప్షన్ తో ఆ వీడియో ప్రారంభం అవుతుంది. తరువాత వీడియోలో ఐఏఎఫ్ తమ సామర్థ్యాన్ని చాటుతూ, ఎల్లప్పుడూ సిద్ధమేనని ఉగ్రవాదులకు అటు పాక్ సైన్యానికి హెచ్చరికలు పంపిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
దేశ చరిత్రలో ధైర్యం, త్యాగాలు చూపించిన లాంగేవాలా (#Laungewala ) ప్రదేశాన్ని జనరల్ ఉపేంద్ర ద్వివేది, COAS సోమవారం సందర్శించారు. ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి దేశాన్ని రక్షించి, అంకితభావంతో స్ఫూర్తినిచ్చిన సైనికుల పరాక్రమాలను ఆయన ప్రశంసించారు. యుద్ధ భూమిలో సైన్యం తమ పరాక్రమాన్ని చూపించి, శత్రువులు తోక ముడిచేలా చేస్తుందన్నారు..
ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు సిద్ధం..
కోణార్క్ కార్ప్స్, ఐఏఎఫ్, భారత వాయుసేన, బీఎస్ఎఫ్ సైనికుల పరాక్రమం, త్యాగాలను కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో వారి పోరాటం, ధైర్యసాహసాలను COAS ప్రశంసించింది. ఇటీవల రాజస్థాన్, గుజరాత్‌లలో పాక్ ఆర్మీ దాడులకు యత్నించిన సమయంలో ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని కాపాడటంలో వారి సంసిద్ధత, నిబద్ధతను సూచిస్తుందని జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రశంసించారు. భవిష్యత్తులో ప్రత్యర్థి చేసే ఏ దాడులైనా భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొంటుందని COAS స్పష్టం చేసింది.