India vs Bharat: దేశం పేరు ఇండియానా, భారతా.. ఈ అంశంపై ఎప్పుడూ జరగనంత చర్చ ఇప్పుడు జరుగుతోంది. భారత్ అనే పేరే ఉండాలని కొందరు, ఇండియాగానే కొనసాగించాలని మరికొందరు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి బీజం ఎప్పుడో పడ్డప్పటికీ.. మరికొన్ని రోజుల్లో జరగబోయే జీ20 సదస్సు.. ఈ వివాదాన్ని మరోసారి చర్చకు వచ్చేలా చేసింది. జీ20 సమ్మిట్ ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంతో దేశం పేరు మార్చబోతున్నారు అనే చర్చ మొదలైంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నట్లు ఇటీవలె కేంద్రంలో బీజేపీ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశం పేరు మార్చడానికే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నారని ప్రతిపక్ష నాయకులు, విశ్లేషకులు అంటున్నారు.


ఈ క్రమంలో దేశం పేరు ఏది ఉండాలి, ఇండియానా.. భారతా.. రాజ్యాంగం ఏం చెబుతోంది, భారత్ అని పేరు మారిస్తే కలిగే లాభాలేంటి అనే విషయాలపై రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను బహిరంగంగానే, సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్(RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో ఇండియా, భారత్ పై చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.


కొన్ని విషయాలను సవివరంగా, విశ్లేషణాత్మకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పర్యాయ పదాలు, విశ్లేషణలు, ఉదాహరణలు కూడా వాడకుండా.. కేవలం చిన్న చిన్న పదాలతోనే చాలా ప్రభావవంతంగా చెప్పవచ్చు. తాజాగా వైరల్ అవుతున్న లాలూ ప్రసాద్ వీడియో అచ్చంగా అలాంటిదే. ఈ వీడియో చాలా ఏళ్ల క్రితం నాటిది. ప్రముఖ ఆంగ్ల మీడియా ఎన్డీటీవీ లాలూ ప్రసాద్ యాదవ్ తో ఇంటర్వ్యూ చేసింది. అందులో ఇండియా, భారత్ అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పెద్దగా విశ్లేషణలు కూడా ఏమీ లేకుండా ఒక్క ముక్కలో తేల్చి పడేశారు. ఇండియా, భారత్ మధ్య పోలికను చెప్పకనే చెప్పేశారు.


ఆ ఇంటర్వ్యూ సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ వేప పుల్లతో పళ్లు తోముకుంటారు. పక్కనే కూర్చున్న రిపోర్టర్.. ఈ వేప పుల్లలు మీకు ఢిల్లీలో దొరుకుతాయా అని అడుగుతారు. దానికి స్పందించిన లాలూ.. ఢిల్లీ ఇండియా కిందకు వస్తుంది అక్కడ దొరకవు.. పాట్నా భారత్ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ దొరుకుతాయి అని అంటారు. అసలు సిసలు దేశం, సంస్కృతి సాంప్రదాయాల కలబోత భారత్ అని.. ఇండియా అనేది బ్రిటీషర్లు పెట్టిన పేరు మాత్రమేనని ఈ వీడియోపై స్పందిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


జీ20 సదస్సు ఆహ్వానాలతో మొదలైన వివాదం


జీ 20 సదస్సు నేపథ్యంలో సెప్టెంబరు 9వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా' కు బదులుగా 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌' అని రాశారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం ఇలా రాయడంపై వివాదం చెలరేగింది. త్వరలో దేశం పేరు ఆంగ్లంలో కూడా భారత్‌గా మారే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి.