India Blocks Chenab Water Release At Baglihar Dam | పాకిస్తాన్‌కు భారత్ మరో షాకిచ్చింది. చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి విడుదలను భారతదేశం నిలిపివేసింది త్వరలో జీలం నదిపై ఉన్న కిషన్‌గాంగ్ డ్యామ్ వద్ద ఇలాంటి చర్యలను చేపట్టాలని భావిస్తున్నట్లు ఓ అధికారి వార్తా సంస్థ పీటీఐతో అన్నారు. ఈ జలవిద్యుత్ ప్లాంట్లు రాంబన్, జమ్మూలోని బాగ్లిహార్, ఉత్తర కాశ్మీర్‌లోని కిషన్‌గాంగ్ డ్యామ్ ద్వారా భారతదేశం నుంచి పాకిస్తాన్‌కు నీటిని విడుదల చేస్తారు.
సింధు జలాల ఒప్పందపై నిషేధం నుంచి వరుస చర్యలు
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ ఉగ్రదాడిలో నేపాల్ టూరిస్ట్ సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. పహల్గాంలో టెర్రరిస్టుల దాడి తరువాత భారతదేశం సింధూ జలాల ఒప్పందం (IWT) నిషేధించినట్లు ప్రకటించింది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన దశాబ్దాల నాటి ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిషేధించింది. భారతదేశం నుంచి పాకిస్తాన్ కు సింధు జలాలు విడుదల చేయకుండా చర్యలు చేపట్టి దాయాదిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది భారత్.
తాజాగా బాగ్లిహార్ డ్యామ్ నుంచి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. కిషన్‌గాంగ్ ప్రాజెక్టుపై పాకిస్తాన్ నుండి ముందు నుంచే విమర్శలను ఎదుర్కొంటున్నాం. పాకిస్తాన్ ముందుగా బాగ్లిహార్ డ్యామ్ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలని వరల్డ్ బ్యాంకును కోరింది. అయితే కిషన్‌గాంగ్ ప్రాజెక్ట్ రాజకీయ, చట్టపరమైన అంశాలతో కూడుకుని ఉంది. ముఖ్యంగా జీలం ఉపనది అయిన నీలం నదిపై దాని ప్రభావం చూపునుంది.
సింధూ జలాలు ఆపితే విధ్వంసం సృష్టిస్తామని పాక్ వార్నింగ్
సింధు జలాల విషయంలో భారతదేశం చేసిన చర్యకు పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శుక్రవారం మాట్లాడుతూ.. సింధు నదిపై IWT ఉల్లంఘనగా పరిగణించే ఏదైనా నిర్మాణానికి తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. జియో న్యూస్‌తో ఆసిఫ్ మాట్లాడుతూ.. ఖచ్చితంగా, భారత్ ఏదైనా నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తే, మేం కచ్చితంగా దానిపై దాడి చేస్తాం.” అని వార్నింగ్ ఇచ్చారు. భారత్ చేసే అలాంటి చర్యలను “ఆక్రమణ”గా ఆయన అభివర్ణించారు.
“ఆక్రమణ అంటే కేవలం తుపాకులు లేదా బుల్లెట్లు వదలడం మాత్రమే కాదు. చాలా రూపాల్లో దాన్ని చేయవచ్చు. అందులో ఒకటి నీటిని అడ్డుకోవడం లేదా దారి మళ్లించడం. దాని వల్ల మరో ప్రాంతంలో దాహం సమస్య తలెత్తి ప్రజల మరణాలకు దారితీయవచ్చు” అని ఆసిఫ్ అన్నారు. భారత్ ఏదైనా నిర్మించాలని చూస్తే, పాకిస్తాన్ ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుందని గుర్తంచకోవాలన్నారు.
భారత్‌కు నోటీసులు ఇవ్వాలని పాక్ యోచన
ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. భారతదేశం ఏకపక్షంగా నీటిని నిలిపివేయడంపై అధికారికంగా దౌత్య నోటీసు జారీ చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. భారతదేశ విదేశాంగ, న్యాయ, జల వనరుల మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ శనివారం అబ్దాలి నుంచి క్షిపణి ప్రయోగం నిర్వహించింది. ఈ క్షిపణి 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్నట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 29న ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పహల్గాం దాడిపై ఎలా స్పందించాలో భారత త్రివిధ దళాలకు తెలుసునన్నారు. భారత బలగాలకు “సంపూర్ణ ఆపరేషనల్ స్వేచ్ఛ” ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.