Gaganyaan Mission:


 
గగన్‌యాన్ అబార్ట్ మిషన్ 


ఇస్రో మరో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తొలిసారి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు (Gaganyaan) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి అబార్ట్ మిషన్‌ నిర్వహించనుంది. ఇస్రో ఛైర్మన్ ఎస్‌. సోమనాథ్ ఇటీవలే ఈ వివరాలు వెల్లడించారు. Physical Research Laboratory వద్ద మీడియా సమావేశంలో రిపోర్టర్లకు ఈ యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారం చెప్పారు. శ్రీహరికోట వద్ద టెస్ట్ వెహికిల్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. క్రూ మోడల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ అసెంబ్లింగ్‌ పనులు ఇప్పటికే మొదలయ్యాయని వివరించారు. 


"గగన్‌యాన్‌ యాత్రకు అబార్ట్ మిషన్ చాలా కీలకం. ఇందుకోసం మేం ప్రత్యేకంగా ఓ రాకెట్ తయారు చేశాం. అదే పరీక్షా వాహన్. ప్రస్తుతానికి ఇది శ్రీహరికోటలో ఉంది. క్రూ మోడల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ని దీనికి అసెంబుల్ చేస్తున్నారు. ఈ నెలాఖరికి ఫంక్షనల్ టెస్టింగ్‌కి అది రెడీ అయిపోతుంది. వైబ్రేషన్ టెస్టింగ్‌ కూడా చేస్తాం. ఆగస్టు నెలాఖరుకి అబార్టెడ్ మిషన్‌ని లాంఛ్ చేస్తాం. ఆ తరవాత విభిన్న అబార్ట్ కండీషన్లలో మిషన్‌ని రిపీట్ చేస్తాం"


- ఎస్‌ సోమనాథ్, ఇస్రో ఛైర్మన్ 


త్వరలోనే మానవరహిత మిషన్‌ని (Unmanned Mission) కూడా నిర్వహిస్తామని సోమనాథ్ వెల్లడించారు. దాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన తరవాత తిరిగి ఇక్కడ ల్యాండ్ అవ్వాలని అన్నారు. అయితే...ప్రస్తుతం మానవసహిత మిషన్‌కి మాత్రం చాలా సవాళ్లున్నాయని చెప్పారు. 


"గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో క్రూ మెంబర్స్ సేఫ్‌టీ అనేదే చాలా కీలకమైన విషయం. అదే పెద్ద సవాలు కూడా. ఇందుకోసమే మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. క్రూ ఎస్కేప్ సిస్టమ్ డెవలప్ చేశాం. ఎమర్జెన్సీలో రాకెట్‌లోని వాళ్లు సేఫ్‌గా బయటకు రావడానికి వీలవుతుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే సిస్టమ్‌ అలెర్ట్ చేస్తుంది. ప్రపల్షన్ సిస్టమ్‌కి సిగ్నల్స్ అందుతాయి. క్రూ వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు ఉంటాయి. ఈ సిస్టమ్ పక్కాగా పని చేస్తుందా లేదా అన్నది టెస్ట్ చేయాలి. అన్నింటికీ ప్రిపేర్ అయిన తరవాతే మిషన్ మొదలు పెడతాం"


-  ఎస్‌ సోమనాథ్, ఇస్రో ఛైర్మన్ 


చంద్రయాన్-3 కూడా...


ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ల్యాండర్, రోవర్, ఉపగ్రహానికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ఇటీవలే విడుల చేసింది. జులై-12న ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జులై-12న చంద్రయాన్-3 మిషన్ ప్రయోగిస్తారు. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV- Mk III నుండి చంద్రయాన్-3 మిషన్‌ ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. భూమిపై కాకుండా మరో ప్రదేశంలో తన వాహనాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యాన్ని పొందడమే ఈ మిషన్ ఉద్దేశం. చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ , ప్రొపల్షన్ మాడ్యూల్ తో పాటు రోవర్ ఉంటాయి. ఇది గ్రహాంతర మిషన్‌ లకు అవసరమైన కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది. ల్యాండర్ మాడ్యూల్‌ కు నిర్ణీత ప్రదేశంలో రోవర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యం ఉంటుంది.