Govt of India to ban 54 Chinese apps: రెండేళ్ల కిందట నుంచి కేంద్ర ప్రభుత్వం చైనా వ్యవహాలను సునిశితంగా పరిశీలిస్తోంది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంగా మరికొన్ని చైనా యాప్‌లను నిషేధించడానికి సిద్ధమైంది. 54 చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించనుంది. దేశ భద్రత నేపథ్యంలో అనుమానిత యాప్‌లపై నిషేధం విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. బ్యాన్ విధించిన యాప్‌లలో బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ (Beauty Camera: Sweet Selfie HD), బ్యూటీ కెమెరా - సెల్ఫీ కెమెరా  (Beauty Camera - Selfie Camera), ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, క్యామ్ కార్డ్ ఫర్ సేల్స్‌ఫోర్స్ ఎంటర్‌టైన్మెంట్, ఐసోలాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ గ్జిరైవర్, ఆన్‌మ్యోజీ చెస్, ఆన్‌మ్యోజీ అరెనా, యాప్ లాక్, డ్యూయస్ స్పేస్ లైట్ వంటి యాప్ లు ఉన్నాయి.


గతంలో 59 చైనా మొబైల్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. టిక్ టాక్, వి ఛాట్, హలో లాంటి చైనా సంస్థలకు చెందిన యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దేశ భద్రతకు సంబంధించి వివరాలు పోగు చేస్తుందన్న సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి అందిన సమాచారంతో మరిన్ని యాప్‌లను భారత్‌లో నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


దేశ సార్వభౌమాధికారం, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్ యూజర్ల ద్వారా సమాచారాన్ని చైనా దేశం యాప్‌ల సహాయంతో సేకరిస్తుందని సెక్యూరిటీ ఏజెన్సీలు కేంద్రానికి తెలిపాయి. అసలే సరిహద్దుల్లో గాల్వన్ లోయ ఉన్న తూర్పు లఢఖ్ లో వివాదాలు ఇంకా సమసిపోలేదు. మరోవైపు చైనా ఆక్రమణలకు పాల్పడుతూ కవ్వింపు చర్యలు ఎల్లప్పుడు కొనసాగిస్తోంది. 






గత ఏడాది సెప్టెంబర్ నెలలో 118 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. స్మార్ట్‌ఫోన్ల ద్వారా, మొబైల్ యాప్స్ ద్వారా భారత పౌరుల సమాచారాన్ని చైనా సేకరిస్తుందని ఆరోపణలున్నాయి. తమ యాప్‌లను భారత్ నిషేధించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. దీనిపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో భారత్‌పై ఫిర్యాదు సైతం చేసింది చైనా. అయితే భారత్ వాదన విన్న అధికారులు తమ నిర్ణయం వెల్డించకుండా మౌనంగా ఉంటున్నారు.