China Vs India : భారతదేశంలో బొమ్మల తయారీ పరిశ్రమ రోజురోజుకూ పుంజుకుంటోంది. ఎంతో డిమాండ్, క్రేజ్ ఉన్న చైనా బొమ్మలను సైతం ఇప్పుడు మన దేశం బీట్ చేసింది. 2020-24 ఆర్థిక సంవత్సరంలో బొమ్మలపై భారత్.. కస్టమ్ డ్యూటీని ఇరవై శాతం నుంచి 70 శాతానికి పెంచింది. దాంతో పాటు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను అమలు చేసింది. ఫలితంగా 2020 ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి 235 మిలియన్ డాలర్ల విలువైన బొమ్మలు దిగుమతి అయ్యాయి. ఇది 2024 నాటికి 41 మిలియన్లకు తగ్గింది. అలాగే, భారతదేశం ఇప్పుడు బొమ్మల నికర ఎగుమతిదారుగా మారింది.
బొమ్మల పరిశ్రమలో చైనాను ఓడించిన భారత్
గత కొంతకాలంగా బొమ్మల పరిశ్రమలో చైనా తిరుగులేని శక్తిగా ఉంది. బొమ్మల దిగుమతుల్లో 70 శాతం వాటాను మాత్రమే భారత్ కలిగి ఉండేది. దీంతో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అంత డిమాండ్ ఉండేది కాదు. ఎందుకంటే మేడ్ ఇన్ చైనా ఐటెమ్స్ కు ఆ దేశం బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు చేయడం వల్ల వాటికి ఇండియాలోనూ మంచి గిరాకీ ఉండేది. కానీ రోజురోజుకూ జనాల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి. క్వాలిటీ వస్తువుల విలువను తెలుసుకుంటున్నారు. దీంతో చైనాలో నాణ్యమైన వస్తువుల కంటే చౌకగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని అర్థం చేసుకోవడం ప్రారంభించారు.
నేటి టెక్నాలజీ పుణ్యమా అని వాటిలో సీసం వంటి భారీ లోహాలు, థాలేట్స్ వంటి సమ్మేళనాలున్నాయని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు ఈ బొమ్మలతో ఎక్కువసేపు గడుపుతారు. తరచుగా వాటిని నోట్లో పెట్టుకోవడం వల్ల, చైనీస్ ప్లాస్టిక్ బొమ్మలు పిల్లలకు సురక్షితం కావని గుర్తించారు. ఆ తర్వాత భారతదేశం 2009లో సగం సంవత్సరం పాటు వాటిపై నిషేధాన్ని అమలు చేసింది. ఈ క్రమంలోనే చైనా నుంచి విషపూరిత బొమ్మల దిగుమతిని తగ్గించడానికి భారతీయ బొమ్మలకు ISI గుర్తును తప్పనిసరి చేసింది. భారతీయ బొమ్మల నాణ్యతను మెరుగుపరచడానికి భారతదేశం బొమ్మల క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ను అమలు చేస్తోంది.
సాంప్రదాయం నుండి ఆధునిక బొమ్మల వరకు
భారతదేశ సంప్రదాయ బొమ్మలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. సహజ చెక్క బొమ్మలు, చెన్నపట్న బొమ్మలు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన తమలపాకు బొమ్మలు భారతీయ సంస్కృతిని సజీవంగా ఉంచుతాయి. వాటిని అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. "భారతదేశంలో ఇంకా శిక్షణ పొందిన బొమ్మల డిజైనర్ల కొరత ఉంది. పరిశ్రమ నాణ్యత, ఆవిష్కరణ, పోటీతత్వంపై మరింత దృష్టి పెట్టాలి" అని ఫన్‌స్కూల్ జనరల్ మేనేజర్ ఫిలిప్ రాయప్పన్ అన్నట్లు ఓ వార్తాపత్రిక తెలిపింది.
"భారతీయ బొమ్మల పరిశ్రమ ఇప్పుడు కొత్త సాంకేతికత, మెరుగైన ఉత్పత్తిపై దృష్టి పెడుతోంది" అని ఎకనామిక్ టైమ్స్ మైక్రో ప్లాస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ విజేంద్ర బాబు తెలిపారు. ఈ ప్రయత్నంలో భాగంగా, ప్లేగ్రో టాయ్స్ వంటి పెద్ద దేశీయ బ్రాండ్‌లు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దేశంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాయి. "భారతదేశంలో PLI పథకం అమలు చేస్తే, గ్లోబల్ బ్రాండ్లు భారతదేశం నుంచి బొమ్మల కొనుగోలుకు ప్రాధాన్యత పెరుగుతుంది. దీని వల్ల భారతదేశ ఎగుమతులు కొన్ని సంవత్సరాలలోనే 150 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లకు పెరుగుతాయి" అని నిపుణులు చెబుతున్నారు.