Amit Shah: 



విపక్ష కూటమిపై అమిత్ షా అసహనం..


సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. విపక్షాలకు హిందూ ధర్మాన్ని అవమానించడం ఇదే తొలిసారి కాదని, వాళ్లకు ఇదో అలవాటైపోయిందని మండి పడ్డారు. I.N.D.I.A కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ సందర్భంలో బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ "మైనార్టీలకే మా తొలి ప్రాధాన్యత" అని చెప్పినట్టు గుర్తు చేశారు షా. తాము మాత్రం నిరుపేదలు, వెనకబడిన వర్గాలు, దళితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. కేవలం మైనార్టీల పేరు చెప్పుకుని ఓట్లు రాబట్టుకోడానికే విపక్ష కూటమి కుతంత్రాలకు పాల్పడుతోందని మండి పడ్డారు. రాహుల్ గాంధీ హిందూ సంస్థల్ని ఉగ్ర సంస్థలతో పోల్చి కించపరిచారని అన్నారు. 


"కొద్ది రోజులు విపక్ష కూటమి పదేపదే సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. కించపరుస్తోంది. ఇదంతా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే. వాళ్లు హిందూ ధర్మాన్ని అవమానించడం ఇదే తొలిసారి కాదు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ కూడా మైనార్టీలకే తమ ప్రాధాన్యత అంటూ హిందువులను అవమానించారు. మేం మాత్రం వెనక బడిన వర్గాలకు న్యాయం చేస్తున్నాం. ప్రధాని మోదీ గెలిస్తే...సనాతన ధర్మానిదే ఆధిపత్యం అవుతుందని కాంగ్రెస్ కంగారు పడుతోంది. రాహుల్ గాంధీ హిందూ సంస్థల్ని ఉగ్ర సంస్థలతో పోల్చారు"


- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 






రాజస్థాన్‌లో పరివర్తన్ యాత్ర..


రాజస్థాన్‌లో పరివర్తన్ యాత్రలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే గహ్లోట్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న అమిత్ షా...ఈ సారి ఆ డోస్ పెంచారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి బీజేపీ సవాలు విసురుతోంది. మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పరివర్తన్ యాత్ర ముగిసే నాటికి రాజస్థాన్‌లో గహ్లోట్ ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని జోస్యం చెప్పారు అమిత్‌షా. దాదాపు 19 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. 2,500 కిలోమీటర్ల మేర ఈ యాత్రను చేపట్టనుంది బీజేపీ. 52 నియోజకవర్గాలు కవర్ కానున్నాయి.