Meri Mati Mera Desh Campaign: అమర జవాన్లు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) వరకూ దేశవ్యాప్తంగా మేరీ మాటీ మేరా దేశ్ (నా మట్టి.. నా దేశం) పేరుతో అమరవీరుల జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మన్ కీ బాత్ లో దేశ ప్రజలను ఉద్దేశించి ఈ కార్యక్రమం గురించి మోదీ చెప్పుకొచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నారు.


దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతో పాటు మొక్కలు దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు మోదీ వెల్లడించారు. ఆ పవిత్రమైన మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో అమృత్ వాటికను నిర్మించనున్నారు. ఆ అమృత్ వాటికలోనే మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఈ అమృత్ వాటిక ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ కు గొప్ప చిహ్నంలా నిలుస్తుందన్నారు. జులై 30వ తేదీన జరిగిన మన్ కీ బాత్ 103 ఎడిషన్ సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. గతేడాది హర్ ఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టగా.. అది విజయవంతం అయింది. దేశవ్యాప్తంగా ప్రతి కుటుంబం తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. 


దేశంలోని నలుమూలల నుంచి 7,500 కలశాల్లో మట్టిని.. అమృత కలశ యాత్ర పేరుతో ఢిల్లీకి తీసుకు వస్తారు. ఈ యాత్రలో భాగంగానే వివిధ ప్రాంతాల నుంచి రకరకాల మొక్కలను కూడా తీసుకెళ్తారు. మొత్తంగా 7,500 కలశాల మట్టితో, మొక్కలతో జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమృత వాటిక నిర్మిస్తారు. ఈ అమృత వాటిక  ఉద్యానవనం.. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కు చిహ్నంలా నిలుస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి ఉద్దేశించబడిందని తెలిపింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన అనేక మంది త్యాగాలను ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా గుర్తించినట్లు అవుతుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ప్రతి భారతీయుడు భాగం కావాలని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. 






Also Read: Manipur Violence: మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి షాక్, సర్కారు నుంచి వైదొలిగిన కీలక పార్టీ


రాబోయే 25 సంవత్సరాలు భారత దేశానికి అమృత కాలమని గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చినట్లు మోదీ గుర్తుచేశారు. అప్పుడు ఎర్రకోట నుంచి అమత్ కాల్ గురించి పంచ ప్రాణ గురించి వివరించినట్లు చెప్పారు. సంకల్పాలను నెరవేర్చడానికి ప్రమాణం చేయాలన్నారు. మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొని చేతితో కలశాలు మట్టిని పట్టుకున్న సెల్ఫీలను yuva.gov.in లో అప్ లోడ్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు.