Independence Day 2022 Live Updates: గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
దేశం నేడు 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
గోల్కొండ కోటపై తెలంగాణ సీఎం జాతీయ జెండాను ఎగురవేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మహానీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిది అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భం ఇదని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. .దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను జరుపుకోవాలన్నారు. ప్రతి భారతీయుడి గెండు అనందంతో ఉప్పొంగే సమయమిదని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటకు బయలుదేరారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటపై సీఎం జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటకు చేరుకోనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా దాదాపు వేయి మంది కళాకారులు స్వాగతం పలుకనున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీస్ దళాలు, రాష్ట్రీయ సెల్యూట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశారు. మొత్తం కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా సమాచార శాఖ అధికారులు ప్రత్యేక తెరలను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే వారికి మంచినీటి సౌకర్యం, వర్షం వచ్చినా ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు పలువురు నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో సీఎంతో పాటు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో 12 కంటిజెంట్స్ పరేడ్ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 10 బ్యాండ్స్ ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను అధికారులు ప్రదర్శిస్తున్నారు.
చివరి వ్యక్తి కోసం శ్రద్ధ వహించాలనే కల, చివరి వ్యక్తిని కూడా సమర్థుడిగా మార్చాలనేది మహాత్మా గాంధీ ఆకాంక్ష. నేను దాని కోసం నన్ను అంకితం చేసుకున్నాను. ఆ ఎనిమిదేళ్లు, అనేక సంవత్సరాల స్వాతంత్య్ర అనుభవం ఫలితంగా 75 సంవత్సరాల స్వాతంత్య్రం సందర్భంగా నేను ఒక సామర్థ్యాన్ని చూడగలిగాను - మోదీ
లాల్ బహదూర్ శాస్త్రి గారి 'జై జవాన్, జై కిసాన్' నినాదాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటాము. తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ నినాదానికి 'జై విజ్ఞాన్' అని జోడించారు. ఇప్పుడు, జోడించాల్సిన మరో అవసరం ఉంది - 'జై అనుసంధాన్' (పరిశోధన & ఆవిష్కరణ). జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ఔర్ జై అనుసంధాన్ - ప్రధాని మోదీ
రాజకీయ సుస్థిరత వల్ల కలిగే ప్రయోజనాలను భారత్ ఇప్పటికే ప్రపంచానికి చాటింది. దీనివల్ల అభివృద్ధిలో వేగం, నిర్ణయాధికారంలో దేశం శక్తివంతం అవుతుంది. రాజకీయ సుస్థిరత ఉండడం అనేది దేశ గౌరవ మర్యాదలను కూడా పెంచుతుంది. వచ్చే 25 ఏళ్లు మనకి అమృత కాలం. అది చాలా ముఖ్యం - మోదీ
వచ్చే 25 ఏళ్లు పంచ ప్రాణాలు పెట్టి అభివృద్ధి కోసం పని చేయాలి. ఈ కాలంలోనే స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేయాలి. సంపూర్ణ అభివృద్ధి మన ముందు ఉన్న అతి పెద్ద ఛాలెంజ్. మనలో ఇంకా ఏ మూలైనా బానిస మనస్తత్వం దాగి ఉంటే దాన్ని పూర్తిగా పారద్రోలాలి. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలి. 1. వికసిత భారతం, 2. బానిసత్వ నిర్మూలన, 3. వారసత్వం, 4. ఏకత్వం, 5. పౌర బాధ్యత ఇవే మన పంచ ప్రాణాలు - మోదీ
భారతదేశం ఒక ఆకాంక్షాపూరిత సమాజం (Aspirational Society), భారతదేశ ప్రజలు సానుకూల మార్పులను కోరుకుంటున్నారు. దానికి సహకరించాలని కూడా కోరుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వం ఈ ఆకాంక్షాపూరిత సమాజం (Aspirational Society) కోసం పని చేయాలి - ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ
ఈ 75 ఏళ్ల ప్రయాణంలో, ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు, పల్లాల మధ్య అందరి కృషితో మనం చేరగలిగిన చోటికి చేరుకున్నాము. 2014లో, పౌరులు నాకు బాధ్యతను అప్పగించారు- స్వాతంత్య్రం తర్వాత జన్మించిన మొదటి వ్యక్తి ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాన్ని అందుకున్నాడు - ప్రధాని
స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడేటప్పుడు గిరిజన సమాజాన్ని మర్చిపోలేం. భగవాన్ బిర్సా ముండా, సిద్ధూ-కణ్హు, అల్లూరి సీతారామ రాజు, గోవింద్ గురు - స్వాతంత్య్ర పోరాటానికి గొంతుకగా నిలిచారు. గిరిజన సమాజాన్ని మాతృభూమి కోసం జీవించడానికి, చనిపోయేందుకు సిద్ధమైన అనేక మంది ఉన్నారు. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన అభివృద్ధి పథాన్ని శంకించే అనేక మంది సంశయవాదులు ఉన్నారు. కానీ, ఈ దేశంలోని ప్రజల గురించి వేరే విషయం ఉందని వారికి తెలియదు. ఈ నేల ప్రత్యేకమైనదని వారికి తెలియదు - ప్రధాని మోదీ
‘‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. 75 ఏళ్ల ప్రయాణంలో భారత్‌కు అమూల్యమైన సామర్థ్యం ఉందని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని భారత్ నిరూపించుకుంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారైనా, దేశాన్ని నిర్మించిన వారైన - డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ జీ, సర్దార్ పటేల్, ఎస్పీ ముఖర్జీ, ఎల్బీ శాస్త్రి, దీనదయాళ్ ఉపాధ్యాయ, జేపీ నారాయణ్, ఆర్‌ఎం లోహియా, వినోబా భావే, నానాజీ దేశ్‌ముఖ్, సుబ్రమణ్య భారతి - అటువంటి గొప్ప వ్యక్తుల ముందు తలవంచండి’’ అని ప్రధాని అన్నారు.
‘‘‘ఆజాదీ మహోత్సవ్’ సందర్భంగా మనం ఎందరో జాతీయ స్వాతంత్య్ర నాయకులను స్మరించుకున్నాం. ఆగస్టు 14న మనం దేశ విభజన నాటి భయాందోళనలను గుర్తుచేసుకున్నాము. గత 75 ఏళ్లలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన దేశ పౌరులందరినీ ఈ రోజు స్మరించుకోవాల్సిన రోజు’’ అని ప్రధాని మోదీ అన్నారు.
రాణి లక్ష్మీబాయి, ఝల్కారీ బాయి, చెన్నమ్మ, బెగన్ హజ్రత్ మహల్.. భారత మహిళల బలాన్ని గుర్తు చేసుకుంటే భారతదేశంలోని ప్రతిఒక్కరూ గర్వంతో నిండిపోతారు - ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ
’’మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలనకు పునాది వేసిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది’’ అని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో అన్నారు.
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాను భారతీయులందరికీ, భారతదేశాన్ని ప్రేమించే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నవ సంకల్పంతో నూతన దిశలో పయనించే రోజు ఇదని అభివర్ణించారు.
దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు భారతదేశ త్రివర్ణ పతాకం దేశంలోని నలుమూలల్లో సగర్వంగా రెపరెపలాడుతోందని అన్నారు.
ఉదయం 7.30 గంటలకు ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉదయం 7.33 గంటలకు జాతినుద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. అయితే అంతకంటే ముందు ప్రధాని మోదీ ఉదయం 7.06 గంటలకు రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత బాపుకు నివాళులర్పించారు.
Background
దేశం నేడు 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోనుంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ ప్రసంగంపై దేశం మొత్తం మాత్రమే కాదు, ప్రపంచం దృష్టి ఉంటుంది. గత 75 ఏళ్లలో భారతదేశం ఎలాంటి కష్టతరమైన దశను ఎదుర్కొంది.. నేడు ప్రపంచానికి అగ్రగామిగా ఎలా నిలుస్తోంది అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, మేక్ ఇన్ ఇండియా సహకారం గురించి ప్రధాని మాట్లాడగలరు. అలాగే ఈ ఏడాది తొలిసారిగా స్వదేశీ తుపాకులతో 21 తుపాకుల గౌరవ వందనం చేయనున్నారు. ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉదయం 6.55 గంటలకు ప్రారంభం అయ్యాయి.
ఇది జరిగిన వెంటనే, డిఫెన్స్ సెక్రటరీ, ఆపై త్రివిధ దళాల చీఫ్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్ లు వస్తారు. రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాత్రి 7.08 గంటలకు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాత్రి 7.11 గంటలకు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 7.18 గంటలకు ఎర్రకోటకు చేరుకుంటారు. ఎర్రకోటకు చేరుకోవడానికి ముందు, రాజ్ ఘాట్ చేరుకుని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు.
వీటన్నింటి తరువాత, ఎర్రకోటకు చేరుకున్న వెంటనే, ప్రధానమంత్రికి త్రివిధ దళాలకు అంటే త్రివిధ దళాలకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు. 7.30 గంటలకు ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు. ఇది జరిగిన వెంటనే, జాతీయ గీతం ప్లే చేస్తారు.
ప్రకటనలపై ఆసక్తి
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో హెల్త్ సెక్టార్‌కు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. "హీల్ ఇన్ ఇండియా", హీల్ బై ఇండియా (Heal in India), (Heal by India) ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తారని సమాచారం. వీటితో పాటు 2047 నాటికి దేశంలో సికిల్ సెల్ వ్యాధి నిర్మూలించాలనే లక్ష్యాన్నీ నిర్దేశిస్తారని కొందరు అధికారులు చెబుతున్నారు. సర్వికల్ క్యాన్సర్‌ను అరికట్టేందుకు తయారు చేసిన వ్యాక్సిన్‌నూ...నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ( National Immunisation Programme)లో చేర్చటం, నేషనల్ హెల్త్ మిషన్‌ను విస్తృతం చేస్తూ కొత్తగా "పీఎం సమగ్ర స్వాస్థ్య మిషన్"(PM Samagra Swasthya Mission) గా పేరు మార్చే ప్రకటనలు చేసే అవకాశముంది. మెడికల్ అండ్ వెల్‌నెస్ టూరిజంకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు హీల్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అమల్లోకి తీసుకురానున్నారు. 12 రాష్ట్రాల్లోని 37 ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరుస్తారని ప్రభుత్వ అధికారులు కొందరు వివరిస్తున్నారు. హీల్ ఇన్ ఇండియాలో భాగంగా...10 విమానాశ్రయాల వద్ద స్పెషల్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ పేషెంట్ల కోసం వీసా నిబంధనలు సులభతరం చేయటం మరో కీలక అంశం. కొన్ని ప్రభుత్వ అధికారిక వర్గాలు పీటీఐకి ఈ వివరాలు వెల్లడించారు.
ఈ ప్రకటనలూ ఉంటాయా..?
ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సార్క్, గల్ఫ్ సహా 44 దేశాల నుంచి పెద్ద ఎత్తున రోగులు భారత్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నట్టు కేంద్రం గుర్తించింది. ఆయా దేశాల్లో వైద్యం స్థితిగతులు ఎలా ఉన్నాయి..? అక్కడ ఎంత ఖర్చవుతోంది అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకుని "హీల్ ఇన్ ఇండియా" ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. ఇక హీల్ బై ఇండియాలో భాగంగా...ఆరోగ్య రంగంలో భారత్‌ను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది కేంద్రం. నిపుణుల సంఖ్యను పెంచి అంతర్జాతీయ పోటీలో నెంబర్ వన్ గా నిలపాలని చూస్తోంది. ఇందుకోసం ఆరోగ్య శాఖ ఆన్‌లైన్‌లో డేటా పొందుపరచనుంది. ఇందులో హెల్త్‌కేర్ నిపుణులు, వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్‌ల వివరాలు ఇందులో పొందు పరుస్తారు. వారి ఇష్టానికి అనుగుణంగా ఆయా దేశాలకు వైద్య సేవలు అందించే అవకాశముంటుంది. జిల్లా స్థాయిలో కేర్ హాస్పిటల్స్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేషనల్ హెల్త్ మిషన్‌ను విస్తృతం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య రంగానికి కేటాయించే వనరుల్లో 5% మేర ఈ కేర్ ఆసుపత్రులకే కేటాయించనున్నట్టు సమాచారం. ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ భాగస్వామ్యంతో 2047 నాటికి దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించేందుకు రోడ్ మ్యాప్ తయారు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 40 ఏళ్ల లోపు ఉన్న 7 కోట్ల మందిని పరీక్షించనున్నారు. 17 రాష్ట్రాల్లోని 200 జిల్లాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. 9-14 ఏళ్ల మధ్యలో ఉన్న బాలికలకు సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈ అన్ని అంశాలపైనా ప్రధాని మోదీ ప్రకటనలు చేస్తారని చెబుతున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -