Indian Air Force | న్యూఢిల్లీ: భారత వాయుసేన కీలక నిర్ణయం తీసుకుంది. మిగ్ 21 యుద్ధ విమానాలు ఇక వాడొద్దని ఐఏఎఫ్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 62 ఏళ్లపాటు మిగ్ 21 యుద్ధ విమానాలు సేవలు అందించాయి. సెప్టెంబర్ 19న మిగ్21 ఫైటర్ జెట్ రిటైర్ అవుతుంది. ఇటీవల కాలంలో పలు ప్రమాదాలకు ఆ యుద్ధ విమానాలు కారణమయ్యాయని తెలిసిందే.

Continues below advertisement


భారత వైమానిక దళం (IAF)లో దాదాపు ఆరు దశాబ్దాల నుంచి MiG-21 బైసన్ జెట్‌లు సేవలు అందిస్తున్నాయి. ఎన్నో యుద్ధాలలో శత్రు సేనలపై దాడులలో పాల్గొని ఈ ఫైటర్ జెట్లు విజయాలు అందించాయి. ఐఏఎఫ్ చివరి మిగ్ 21 యుద్ధ విమానం సెప్టెంబర్ 19న అధికారికంగా ఉపసంహరించుకుంటుంది. వీటిని భర్తీ చేయడానికి ఉద్దేశించిన తేజస్ యుద్ధ విమానాల డెలివరీలో జాప్యం కొనసాగుతోంది. దాంతో మిగ్ ఫైటర్ జెట్లను వాయుసేన కొనసాగిస్తోంది. 


తేజస్ కోసం చూస్తున్న వాయుసేన


తేజస్ Mk1A ఫైటర్ జెట్లను మరింత పవర్ ఫుల్ చేయడానికి  ఉద్దేశించిన జనరల్ ఎలక్ట్రిక్ నుంచి GE F404-IN20 ఇంజిన్‌లను ఆలస్యంగా సరఫరా చేయడం తాజా నిర్ణయానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇంజిన్ డెలివరీలు మార్చి 2024లో ప్రారంభమవుతాయని ఐఏఎఫ్ భావించింది. కానీ ఏకంగా ఒక సంవత్సరం ఆలస్యంగా వచ్చాయి. HAL మొదటి ఇంజిన్‌ను మార్చి 2025లో అందుకుంది, ఆ తర్వాత జూలైలో రెండవ ఇంజిన్ వచ్చింది. జనరల్ ఎలక్ట్రిక్ మార్చి 2026 వరకు నెలకు 2 ఇంజిన్‌ల చొప్పున సరఫరాను పెంచుతుందని సమాచారం. 


ఇంజిన్లు లేకపోవడంతో HAL కు ఇబ్బందులు


HAL కనీసం 6 తేజస్ Mk1A ఎయిర్‌ఫ్రేమ్‌లను పూర్తి చేసినా, ఇంజిన్లు లేకపోవడంతో అవి నిలిచిపోయాయి. ఇంజిన్ సరఫరా షెడ్యూల్ ప్రకారం జరిగి ఉంటే మార్చి 2026 నాటికి ఆరు విమానాల డెలివరీకి కంపెనీ సిద్ధంగా ఉందని HAL చైర్మన్ డీకే సునీల్ వెల్లడించారు. 


ఈ జాప్యం కారణంగా ఐఏఎఫ్ తన మిగ్-21 బైసన్ జెట్‌లను నిర్దేశిత టైం కంటే ఎక్కువ కాలం కొనసాగించాల్సి వచ్చింది.  తద్వారా స్క్వాడ్రన్ బలం మరింత బలహీనపడకుండా భారత వాయుసేన చర్యలు తీసుకుంది. IAF ప్రస్తుతం 29 ఫైటర్ జెట్ స్వ్కాడ్రన్ లను మెయింటైన్ చేస్తోంది. ఇది మనకు పర్మిషన్ ఉన్న  42 కంటే చాలా తక్కువ అని చెప్పవచ్చు.


సెప్టెంబర్ 19న మిగ్ 21కు వీడ్కోలు


సెప్టెంబర్ 19న చండీగఢ్‌లో ఫైటర్ జెట్ మిగ్ 21 పదవీ విరమణ కార్యక్రమం జరుగుతుంది. MiG-21లను దశలవారీగా తొలగించడంతో IAF లెగసీ ఫ్లీట్ తగ్గుతుంది కానీ, తేజస్ Mk1A తమ అమ్ములపొదిలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి వాయుసేన చర్యలు చేపట్టింది.