AAP Leader Arvind Kejriwal | న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బంపరాఫర్ ఇచ్చారు. తన ఛాలెంజ్ స్వీకరించి, మాట నిలబెట్టుకుంటే తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ కేజ్రీవాల్ ఛాలెంజ్ చేశారు. ఎన్నికల ర్యాలీలో ఆదివారం నాడు పాల్గొన్న సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ మురికివాడల కూల్చివేతలపై నమోదైన అన్ని కేసులను ఎత్తివేసి, వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయనని కేంద్ర మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. 


ఎన్నికలు అంటే మురికివాడలు గుర్తొస్తాయా?


ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఢిల్లీలోని అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. న్యూఢిల్లీలోని షకూర్ బస్తీ ప్రాంతంలో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. మురికివాడల నివసించే వారి సంక్షేమం కంటే భూసేకరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. మరో 30 రోజుల తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి, ఈ బీజేపీ నేతలు ఇప్పుడు వచ్చి మీ మురికివాడల్లో నిద్రపోతున్నారు. గత 10 ఏళ్లలో ఈ పని ఎందుకు చేయలేదో ప్రజలు అర్థం చేసుకోవాలి. కేవలం ఎన్నికల సమయంలో మురికివాడల్లోని ప్రజలు బీజేపీ నేతలకు గుర్తొ్స్తారని’ ఎద్దేవా చేశారు. 


ఢిల్లీ మురికివాడల్లోని ప్రజలను బీజేపీ ప్రేమించడం లేదని, కానీ ఈ ప్రాంతంపై మాత్రం ఇష్టం పెంచుకుంటుంది. బీజేపీకి మొదటగా మీ ఓట్లు కావాలి. ఎన్నికల తరువాత మీరు నివాసం ఉంటున్న స్థలాలు వారి స్వాధీనం కావాలి. ఇదే వారి అసలు ప్లాన్. బీజేపీ ప్రచారం చేసుకుంటున్న 'జహాన్ జుగ్గీ వాహన్ మకాన్' పథకం కేవలం  కంటితుడుపు చర్య. 


మురికివాడల్లోని స్థలాలపై బీజేపీ కన్నేసింది


గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం 4,700 ఫ్లాట్లను నిర్మించింది. కానీ బీజేపీ మురికివాడల్లోని వారి ఇండ్ల స్థలాలపై కన్నేసింది. మీరు కనుక వారికి ఓట్లు వేస్లే ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వస్తుంది. బీజేపీ జిత్తులను మీరు తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది. మురికివాడల్లోని నివాసాలను అక్రమంగా కూల్చివేసి, అక్కడ నివసించే వారిని ఇతర ప్రాంతాలకు వెల్లగొట్టేందుకు బీజేపీ వెనుకాడదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.






గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తుగ్లకాబాద్ సహా జంగ్పురాలోని మురికివాడల్లో భారీగా కూల్చివేతలు చేపట్టారు. ఫలితంగా 3 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. మీరు వారి భూములను లాక్కున్నారు. తప్పు సరిదిద్దుకుని వారిపై నమోదైన కేసులు కొట్టివేయడంతో పాటు వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇస్తే.. తాను ఎన్నికల్లో పోటీ చేయనని కేజ్రీవాల్ ఛాలెంజ్ చేశారు. తన సవాల్ ను అమిత్ షా స్వీకరించాలని సైతం కేజ్రీవాల్ కోరారు. షకుర్ బస్తీ నియోజకవర్గం నుంచి ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ పార్టీ అధినేత కేజ్రీవాల్ వెంట ఉన్నారు. 2013, 2015 ఢిల్లీ ఎన్నికల్లో నెగ్గిన సత్యేంద్ర జైన్  2020లో సైతం ఉత్కంఠ పోరులో నెగ్గారు. అదే స్థానం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 


ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు


కేంద్రం ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.  ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనుంది ఈసీ. 2020లో జరిగిన గత ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకుగానూ 62 స్థానాల్లో ఆప్ ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం చేపట్టింది. నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందకు ఆప్ సిద్ధమవుతోంది.


Also Read: Trump's Swearing-in Ceremony : ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు - భారత ప్రతినిధిగా వెళ్లనున్న జయశంకర్